ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలోని మున్సియారీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఉత్తరాఖండ్ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయ్ కుమార్ జోగ్దాండే కూడా హెలికాప్టర్‌లో ఉన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్‌ను విజయవంతంగా పొలంలో దించారు. విమానంలో ఉన్నవారంతా సురక్షితంగా ఉన్నారు. సమాచారం అందగానే సమీపంలోని మున్సియరీ తహసీల్ అధికార బృందం అక్కడకు చేరుకుంది.
సమాచారం ప్రకారం.. బుధవారం కేంద్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ విజయ్ కుమార్ జోగ్దాండే ట్రెక్కింగ్ కోసం మున్సియరీలోని మిలామ్‌కు బయలుదేరారు. డెహ్రాడూన్ నుంచి హెలికాప్టర్‌లో మిలామ్‌కు బయలుదేరారు. హిమాలయ ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్‌ను ముందుకు తీసుకెళ్లడం కష్టంగా మారడంతో మిలామ్ కంటే ముందే ర్యాలం వద్ద అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.