భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్‌ధామ్ తీర్థయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం ధామి పరిస్థితిని సమీక్షించారు. జిల్లాల మేజిస్ట్రేట్‌లకు వర్షం, ట్రాఫిక్ పరిస్థితి గురించి గంట గంటకు నివేదిక ఇవ్వాలని సూచించారు. కేదార్‌నాథ్ టెంపుల్ వద్ద 6 వేల భక్తులు ఉండగా, వారిలో 4 వేల మంది తిరిగివచ్చినట్లు రుద్రప్రయాగ్ డీఎం సీఎం ధామికి తెలిపారు. మరో 2 వేల మంది భక్తులు సురక్షిత ప్రాంతంలో ఉన్నారన్నారు.
బద్రీనాథ్, గంగోత్రి, కేదార్‌నాథ్, యమునోత్రికి భక్తులు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఉత్తరాఖండ్‌లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. యమునోత్రి వైపు వేళ్లే యాత్రికులందరూ బాఫ్‌కోట్, జంకిచట్టి వద్ద ఉండాలని, గంగోత్రి వైపు వేళ్లవారు భట్వారీ, హర్సిల్, మానేరిలో ఉండాలని ఉత్తరకాశి జిల్లా మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ చెప్పారు. ఇక బద్రీనాథ్ ఆలయం వైపు వెళ్లే భక్తులు జోషిమఠ, చమోలిలో సురక్షితంగా ఉన్నారు అలాగే కేదార్‌నాథ్ వైపు వెళ్తున్న మొత్తం 400 మంది యాత్రికులను లించౌలి, భీంబలిలో నిలిపివేశారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్ సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి మంచు కురుస్తోంది.