ఇంకా చల్లారని 'మహా' మంటలు..!
మహారాష్ట్ర కొత్త క్యాబినెట్‌లో సీనియర్ ఎన్‌సిపి నాయకుడు ఛగన్ భుజ్‌బల్‌ను చేర్చుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మద్దతుదారులు మంగళవారం పూణెలో నిరసన తెలిపారు.
By Medi Samrat Published on 18 Dec 2024 8:32 AM IST
మహారాష్ట్ర కొత్త క్యాబినెట్‌లో సీనియర్ ఎన్‌సిపి నాయకుడు ఛగన్ భుజ్‌బల్‌ను చేర్చుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మద్దతుదారులు మంగళవారం పూణెలో నిరసన తెలిపారు. ఇది ఓబీసీ వర్గాన్ని అవమానించడమేనని అన్నారు. పూణె జిల్లాలోని బారామతిలో ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ బంగ్లా వెలుపల కూడా నిరసనలు జరిగాయి. మాజీ మంత్రి భుజ్‌బల్, ఎన్‌సిపికి చెందిన దిలీప్ వాల్సే పాటిల్, బిజెపికి చెందిన సుధీర్ ముంగంటివార్, విజయ్ కుమార్ గవిత్‌లకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు.
పూణే జిల్లా కలెక్టరేట్ వెలుపల నిరసనలో పాల్గొన్న కోపోద్రిక్తుడైన ఓ మద్దతుదారుడు..ఎన్‌సిపిలో అత్యంత సీనియర్ నాయకుడు అయినప్పటికీ.. భుజబల్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించలేదని అన్నారు. ఇది ఓబీసీ వర్గాన్ని అవమానించడమే.. మీరు సీనియర్ నేతలకు కేబినెట్ పదవులు కేటాయించాలని నిర్ణయించుకుంటే.. అదే నిబంధన ఇతరులకు ఎందుకు వర్తించలేదన్నారు.
రెండున్నరేళ్ల తర్వాత భుజ్‌బల్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగిస్తున్నట్లు అజిత్ పవార్ ప్రకటించాలని ఒక నిరసనకారుడు డిమాండ్ చేశాడు. మరాఠా కమ్యూనిటీకి ఓబీసీ హోదా కల్పించాలని కోరుతూ మనోజ్ జరంగే పాటిల్ నిరాహార దీక్ష చేసినప్పుడు.. ఓబీసీల పక్షాన భుజబల్ మాత్రమే నిలిచారని మరో నిరసనకారుడు చెప్పాడు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నేత ఛగన్ భుజ్‌బల్ ఆగ్రహం మరింత పెరుగుతోంది. మహారాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై భుజబల్ అసంతృప్తితో ఉన్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్‌పై ఆయన మంగళవారం పరోక్షంగా విరుచుకుపడ్డారు. నన్ను మంత్రివర్గంలో చేర్చుకోవడానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా ఉన్నారని భుజ్‌బల్ పేర్కొన్నారు. గౌరవం లేని చోట జీవించలేం అనే ప్రకటన చర్చనీయాంశమైంది. పార్టీ కార్యకర్తలు, తన అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలతో చర్చించి బుధవారం నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మంత్రి పదవి రానందుకు నాకు నిరాశ లేదు.. కానీ ఈ ప్రవర్తన వల్ల అవమానంగా భావిస్తున్నానన్నారు. ఛగన్ భుజబల్ ఓబీసీ నాయకుడిగా గుర్తింపు పొందారు.