గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు మరియు బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఎల్పీజీ (LPG) బుకింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తూ, రీఫిల్ బుకింగ్ పీరియడ్‌ను గతంలో ఉన్న 21 రోజుల నుండి 25 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొంతమంది వినియోగదారులు గతంలో 55 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకుంటే, ఇటీవల కేవలం 15 రోజుల వ్యవధిలోనే రీఫిల్ కోసం బుక్ చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి అసాధారణ బుకింగ్‌ల వల్ల కృత్రిమ కొరత ఏర్పడటంతో పాటు, గృహ అవసరాలకు కేటాయించిన సిలిండర్లు పక్కదారి పట్టే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత మరో సిలిండర్ బుక్ చేసుకోవడానికి మధ్య ఉండాల్సిన కనీస గడువును పెంచింది. అదేవిధంగా, మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు సంస్థలను, రిఫైనరీలను ఆదేశించింది. ముఖ్యంగా కమర్షియల్ అవసరాల కంటే సామాన్య ప్రజల గృహ అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎక్కడా గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల అనవసరపు నిల్వలు తగ్గి, నిజమైన అవసరం ఉన్న వినియోగదారులకు సకాలంలో గ్యాస్ అందుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.