సీఏపీఎఫ్ కానిస్టేబుల్ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. CRPF సహా సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగ భర్తీ పరీక్షను ఇకపై ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఈ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో అన్ని రాష్ట్రాల స్థానిక యువతకు స్థానం కల్పిండంతో పాటు, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యమని తెలిపారు. తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో 2024 జనవరి 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది.
ఇటీవల విడుదల అయిన సీఆర్పీఎఫ్ (CRPF) కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లో ప్రాంతీయ భాషల్లో ఆ పరీక్షను రాసే అవకాశం ఇవ్వకపోవడంపై రాజకీయంగా దుమారం చెలరేగింది. ఇంగ్లీష్, లేదా హిందీల మాత్రమే ఈ పరీక్ష రాసే అవకాశం కల్పించడంపై పలు ప్రాంతీయ పార్టీలు విమర్శలు గుప్పించాయి.