జమ్మూ కశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ‌కు మేము సిద్ధమే: కేంద్రం

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం 2019 లో రద్దు చేసింది.

By Medi Samrat  Published on  31 Aug 2023 3:52 PM GMT
జమ్మూ కశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ‌కు మేము సిద్ధమే: కేంద్రం

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం 2019 లో రద్దు చేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తాజాగా సుప్రీం కోర్టుకు వెల్లడించింది. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై గత కొంత కాలంగా విచారణ జరుపుతున్న దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని క వివరాలు కోరింది. సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన కేంద్ర ప్రభుత్వం జమ్మ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడానికి ఏదైనా కాలపరిమితి ఉందా అని సుప్రీం కోర్టు ధర్మాసనం అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు అవసరమైన విధి విధానాలను రూపొందిస్తున్నామని తెలిపింది. దీనికి కొంత సమయం పడుతుందని కేంద్రం వెల్లడించింది. జమ్ము కశ్మీర్‌, లడఖ్ ప్రాంతాలకు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదని కూడా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం చేతుల్లో ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉందని ధర్మాసనానికి తెలిపారు. పంచాయతీ, మున్సిపల్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాలని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశానికి కాల వ్యవధిని నిర్ణయించలేమని తుషార్ మెహతా సుప్రీంకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌ని గణనీయమైన స్థాయిలో అభివృద్ధి చేసినట్లు సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. కొత్త ప్రాజెక్టులు భారీ స్థాయిలో వస్తున్నాయని చెప్పారు. ఉగ్రవాద చర్యలు 42.5 శాతం తగ్గాయని అన్నారు. చొరబాటు ఘటనలు 90.20 శాతం తగ్గాయని తెలిపారు.

Next Story