ఎయిర్ బ్యాగ్స్ ను తప్పనిసరి చేసిన కేంద్రం
Centre proposes to make front airbags mandatory in cars. ఎయిర్ బ్యాగ్స్ ఉంటే ఎన్నో ప్రాణాలను నిలబెట్టే అవకాశాలు ఉంటాయి.
By Medi Samrat Published on 30 Dec 2020 11:18 AM IST
ఎయిర్ బ్యాగ్స్ ఉంటే ఎన్నో ప్రాణాలను నిలబెట్టే అవకాశాలు ఉంటాయి. ఎం1 కేటగిరీ వాహనాల్లో డ్రైవర్ సీటులో ఎయిర్ బ్యాగ్‌ను కేంద్రం ఇప్పటికే తప్పనిసరి చేసింది. గతేడాది జులై 1 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. కారు ముందు వైపు ఉండే ప్యాసింజర్ సీటులో కూడా ఎయిర్ బ్యాగు ఉండాలనే నిబంధనకు అనుగుణంగా వాహనదారులు మార్పులు చేయాల్సి ఉంటుంది. చాలా ప్రమాదాల్లో ఎయిర్ బ్యాగ్స్ లేని వాహనాల కారణంగా ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు వెల్లడించింది.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త కార్లలో ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి అని చెబుతూ ఉన్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర రవాణాశాఖ ముసాయిదా నోటిఫికేషన్ తాజాగా విడుదల చేసింది. డ్రైవర్ పక్కన కూర్చునే వారికి కూడా ప్రమాదం పొంచి ఉండడంతో ఆ సీటులోనూ ఎయిర్ బ్యాగ్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త మోడల్ కార్లకు ఈ నిబంధన తప్పనిసరి కానుంది. 2021 జూన్ 1ని తుది గడువుగా చెబుతోంది. ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలు, సూచనలను నెల రోజుల్లోగా తెలపాలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రస్తుత మోడళ్లు కూడా తప్పనిసరిగా ఎయిర్ బ్యాగ్‌ను అమర్చుకోవాలని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం.
కొత్త మోడల్ కార్లకు 2021, ఏప్రిల్ 1 వరకు, ఇప్పటికే వాడుతున్న కార్లకు 2021, జూన్ 1 గడువు తేదీలుగా నిర్ణయించింది. ఎయిర్ బ్యాగుల ప్రమాణాల గురించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ఆదేశాలు వెలువడేంత వరకు అవి ఏఐఎస్ 145 నిబంధనలకు అణుగుణంగా ఉండాలని ఈ నోటిఫికేషన్‌లో సూచించారు.