సిమిపై మరో ఐదేళ్ల పాటు నిషేధం పొడిగింపు
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.
By Medi Samrat Published on 29 Jan 2024 2:56 PM GMTస్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 'చట్టవిరుద్ధమైన సంఘం'గా పేర్కొంటూ సిమి పై నిషేధాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం పొడిగించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద సిమిపై నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. భారతదేశ సార్వభౌమాధికారం, భద్రత, సమగ్రతకు భంగం వాటిల్లేలా సిమి ప్రయత్నిస్తూ ఉందని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)’పై జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రధాని నరేంద్రమోదీ అవలంబిస్తూ ఉన్నారని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం ట్విట్టర్ లో తెలిపింది. 2014లో భోపాల్ జైల్ బ్రేక్, 2014లో బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో పేలుడు, 2017లో గయా పేలుళ్లతో సహా దేశంలో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో సిమి సభ్యులు భాగమయ్యారు.
ఉత్తరప్రదేశ్, కేరళ, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో సిమి కార్యకలాపాలు నిర్వహించింది. సిమిపై 2014 ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం తొలిసారి నిషేధం విధించింది. 2019లో ఈ నిషేధాన్ని ఐదేళ్లపాటు పొడిగించింది. ఇప్పుడు మరో ఐదేళ్లు నిషేధం ఎదుర్కోనుంది. 1977 ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లోని ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్ మహ్మద్ అహ్మదుల్లా సిద్ధిఖీ సిమిని స్థాపించారు.