కోవిడ్ నియంత్రణ, నిఘా, అప్రమత్తతపై కేంద్ర హోంశాఖ తాజా మార్గదర్శకాలు

Central Home Affairs Guidelines About Coronavirus. కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ

By Medi Samrat  Published on  27 Nov 2020 4:37 AM GMT
కోవిడ్ నియంత్రణ, నిఘా, అప్రమత్తతపై కేంద్ర హోంశాఖ తాజా మార్గదర్శకాలు

కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో కొత్తగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో కేంద్ర హోంశాఖ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇవి 2020 డిసెంబర్ 1 నుంచి 31 వరకు అమలులో ఉంటాయి. ఓవైపు శీతాకాలం, మరోవైపు పండుగల సీజన్ కారణంగా వైరస్ మహమ్మారి నుంచి బయటపడేందుకు మరిన్ని జాగ్రత్తలు అవసరమని తెలిపింది. ముఖ్యంగా హోంమంత్రిత్వశాఖ, వైద్యఆరోగ్య మంత్రిత్వశాఖ, స్థానిక అధికారులు, పోలీసులు జారీ చేసిన నియంత్రణ వ్యూహాలను కచ్చితంగా అమలు చేయడం, నిఘా పెంచడం, కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను, ప్రామాణిక నిర్వహణా నియమాలను పాటించటం ద్వారా కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలో ఎదురయ్యే పరిస్థితుల ఆధారంగా కరోనా నియంత్రణకు మరికొన్ని ఆంక్షలు విధించవచ్చని కేంద్రం తెలిపింది.

నిఘా, నియంత్రణ

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అక్కడి జిల్లా ఆధికారులచేత కంటెయిన్మెంట్ జోన్ల పరిధులు కచ్చితంగా గుర్తించేట్టు చూడాలి. ఈ విషయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించాలి. ఆయా రాష్ట్రాలలో జిల్లా కలెక్టర్లు కంటెయిన్మెంట్ జోన్ల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాలి. ఆ జాబితాను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు కూడా పంపాలి.

అవసరాన్ని బట్టి నిర్థారణ పరీక్షలు

పాజిటివ్ గా తేలిన వ్యక్తులు ఎవరెవరికి దగ్గరగా వెళ్లారో ఆ జాబితా కచ్చితంగా తయారు చేయాలి. అదే సమయంలో ఆచూకీ కనిపెట్టటం, గుర్తించినవారిని క్వారంటైన్ లో ఉంచటం, 14 రోజులపాటు వరుసగా వారిని పర్యవేక్షించటం తప్పనిసరి. సోకే అవకాశమున్నవారిలో కనీసం 80 శాతం మందిని 72 గంటలలోగా ఆచూకీ పట్టుకోవాలి. అటువంటి వారిని వెంటనే ఐసొలేషన్ కు తరలించటం, లేదా ఆస్పత్రికి తరలించాలి. ఇళ్లలో కచ్చితంగా ఐసోలేషన్ మార్గదర్శకాలు పాటించాలి. అవసరమైన మేరకు చికిత్సాపద్ధతులు కచ్చితంగా పాటించేట్టు చూడాలి. శ్వాస సంబంధమైన వ్యాధులున్నవారికి ఆరోగ్య కేంద్రాలలో లేదా మొబైల్ సేవల ద్వారా లేదా బఫర్ జోన్లలో ఉన్న జ్వర చికిత్సాకేంద్రాల ద్వారా చికిత్స అందేట్టు చూడాలి.

మాస్క్ ధరించని వ్యక్తులకు జరిమానా

కోవిడ్ నియంత్రణకు అవసరమైన జాగ్రత్తల గురించి స్థానిక ప్రజలలో తగినంత అవగాహన కలిగించాలి. కంటెయిన్మెంట్ చర్యలను కఠినంగా అమలు చేయటంలో స్థానిక జిల్లా అధికారులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు బాధ్యత వహించాలి. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆ అధికారులను బాధ్యులను చేయాలి. కోవిడ్ నియంత్రణకు అవసరమైన మార్గదర్శకాలు అమలు చేయటానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని రకాల చర్యలూ తీసుకోవాలి. అందులో భాగంగా మాస్కులు ధరించటాన్ని, చేతుల పరిశుభ్రతను కచ్చితంగా అమలు చేయాలి. అవసరమనిపించినప్పుడు పాలనాపరమైన చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగా బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించని వ్యక్తులకు జరిమానా విధించవచ్చు..

కరోనాపై అవగాహన

కోవిడ్ నియంత్రణకు అవసరమైన జాగ్రత్తల గురించి స్థానికంగా ప్రజలలో తగినంత అవగాహన కలిగించాలి. కంటెయిన్మెంట్ జోన్లలో చర్యలను కఠినంగా అమలు చేయటంలో స్థానిక జిల్లా అధికారులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు బాధ్యత వహించాలి. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అధికారులను బాధ్యులను చేయాలి.

కంటెయిన్మెంట్ జోన్లకు

కంటెయిన్మెంట్ జోన్లకు వెలుపల అన్ని కార్యకలాపాలకూ ఆమోదం ఉంది. అయితే, దిగువ ఉన్న అంశాలకు మాత్రం కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే అనుమతి ఉంటుంది.

- హోం మంత్రిత్వశాఖ అనుమతి మేరకు అంతర్జాతీయ ప్రయాణానికి ఆమోదం

- 50శాతం సీట్లతో సినిమా థియేటర్లకు అనుమతి...

- ఈత కొలనులు కేవలం క్రీడాకారులకు మాత్రమే అనుమతి

- వ్యాపారులకోసం మాత్రమే ఎగ్జిబిషన్ హాల్స్ (బి2బి)

- గరిష్ఠ పరిమితి 200 కు లోబడి హాల్ సామర్థ్యంలో 50శాతం మాత్రమే అనుమతిస్తూ సామాజిక, మతపరమైన, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొచ్చు.

- బహిరంగ ప్రదేశాలైతే ఆ ప్రాంగణం వైశాల్యాన్ని బట్టి అనుమతి.

- పరిస్థితిని అంచనావేసిన మీదట అక్కడి రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర పాలిత ప్రాంతం హాళ్లలో గరిష్ఠ పరిమితిని 100 మందికి, లేదా అంతకంటే తక్కువకు కుదించవచ్చు.

- అందరి సమాచారం నిమిత్తం ఈ మార్గదర్శకాలకు గతంలో సందర్భానుసారం జారీచేసిన ప్రామాణిక ఆచరణ విధానాలను, అనుమతించిన కార్యకలాపాలను సంబంధిత అధికారులు వీటిని కచ్చితంగా అమలు చేయాలి.

స్థానికంగా ఆంక్షలు

స్థానికంగా ఉండే పరిస్థితులను అంచనా వేసిన మీదట రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం రాత్రిపూట కర్ఫ్యూ లాంటి కొన్ని ఆంక్షలు విధించవచ్చు. అయితే, కేంద్రం నుంచి ముందస్తు అనుమతి లేకుండా కంటెయిన్మెంట్ జోన్లకు వెలుపల స్థానికంగా లాక్ డౌన్ విధించకూడదు.

రాష్ట్రాలు చేయాల్సిన అంశాలు

* రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రి కర్ఫ్యూలాంటి ఆంక్షలను స్థానికంగా విధించుకోవచ్చు. అయితే కంటెయిన్‌మెంట్‌ జోన్ల బయట కేంద్ర ప్రభుత్వంతో ముందుగా సంప్రదించకుండా రాష్ట్ర, జిల్లా, సబ్‌డివిజన్‌, నగర స్థాయుల్లో లాక్‌డౌన్లు మాత్రం విధించకూడదు.

* వారంలో 10%కి మించి పాజిటివిటీ రేట్‌ ఉన్న నగరాల్లో ఆఫీసు పనివేళలు దశలవారీగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.

* రాష్ట్రం లోపలగాని, రాష్ట్రాల మధ్య గాని వ్యక్తుల రాకపోకలకు, సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలూ ఉండవు. విదేశీ సరకు రవాణాకు న్కూడా ఈ సడలింపు అమలులో ఉంటుంది. ఎలాంటి ప్రత్యేకమైన అనుమతులు గాని, ఈ-పాస్ లు గాని అవసరం లేదు.

* 65ఏళ్ల పైబడినవారు, అనారోగ్య సమస్యలున్నవారు, గర్భిణీలు, 10 ఏళ్లలోపు పిల్లలు అత్యవసరాలు, ఆరోగ్య సమస్యల విషయంలో తప్పితే మిగిలిన సమయాల్లో ఇంటికే పరిమితం కావాలి.

వైరస్ బారిన పడే అవకాశమున్నవారికి

కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నవారు అంటే 65 ఏళ్ల వయసు పైబడినవారు, దీర్ఘకాల వ్యాధులున్నవారు, గర్భిణులు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఇళ్ళలోనే ఉండిపోవటం మంచిది. మరీ ముఖ్యమైన పనులు, ఆరోగ్య అవసరాలకు మాత్రమే ఇళ్లు వదలాలి.

ఆరోగ్య సేతు వాడకం

ఆరోగ్య సేతు మొబైల్ యాప్ వాడకాన్ని ఎప్పటిలాగే ప్రోత్సహించాలి.


Next Story