దీపావళి ముందు రోజు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి.. దేశ ప్రజలకు పెద్ద గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు మరో పెద్ద శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా వంట నూనెల ధరలను తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రూ.7 నుంచి రూ.20 వరకు లీటర్ వంట నూనెపై తగ్గించింది. వేరు శెనగ నూనెపై రూ.18, సోయాబీన్‌పై రూ.10, పామాయిల్‌పై రూ.20, సన్‌ఫ్లవర్ నూనెపై రూ.7 తగ్గించింది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలతో అతాలకుతలం అవుతున్న సామాన్య ప్రజానీకానికి ఊరట కలిగినట్లైంది. దేశంలో పెరుగుతున్న ధరలు స్థీరికరించడంలో భాగంగానే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని పలువురు అంటున్నారు. ఇప్పటికే ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దీంతో ఇతర ధరలపై ఇది ప్రభావం చూపుతుంది.
మరిన్ని వస్తువుల ధరలు కూడా త్వరలో తగ్గుతాయని ఆర్థిక వేత్తలు, బీజేపీ నాయకులు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. దీపావళి ముందు రోజు పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పలు రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. ఇక కొన్ని రాష్ట్రాల్లోనైతే పెట్రోల్, డీజిల్ ధరలు పెద్ద మొత్తంలో తగ్గాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాయేమోనని వాహనదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.