రైతులు, ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు
కేంద్ర ప్రభుత్వం మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రెండు ప్రధాన నిర్ణయాలను ఆమోదించింది.
By - Knakam Karthik |
రైతులు, ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రెండు ప్రధాన నిర్ణయాలను ఆమోదించింది. 8వ వేతన సంఘం, రబీ సీజన్ ఎరువుల సబ్సిడీకి ఆమోదం తెలిపింది. కాగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరియు ఇతర లాభాల పునఃసమీక్ష కోసం 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన షరతులను (Terms of Reference) మంత్రివర్గం ఆమోదించింది. ఈ కమిషన్ 18 నెలల్లోపు సిఫార్సులు సమర్పించాల్సి ఉంటుంది. దీని పరిధిలో సుమారు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 69 లక్షల పింఛన్‌దారులు ఉంటారు. మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను సేకరించిన తరువాతే తుది షరతులు నిర్ణయించబడ్డాయి.
రబీ సీజన్ ఎరువుల సబ్సిడీ
మంత్రివర్గం రబీ సీజన్ కోసం పోషకత ఆధారిత ఎరువుల సబ్సిడీ పథకాన్ని ఆమోదించింది. ఈ సబ్సిడీ రేట్లు అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి వస్తాయి. మొత్తం రూ.37,952 కోట్ల సబ్సిడీ కేటాయించబడింది. ఈ పథకం కింద నైట్రజన్ (N), ఫాస్పరస్ (P), పొటాష్ (K), సల్ఫర్ (S) వంటి పోషకాలపై కిలోగ్రామ్‌ప్రాతిపదికన సబ్సిడీ ఇస్తారు. ప్రభుత్వం తెలిపిన ప్రకారం, ఈ నిర్ణయాలు రైతులకు తగిన ధరకే ఎరువులు అందేలా చేస్తాయి. అలాగే దేశీయంగా తయారు చేసే అమోనియం సల్ఫేట్ అందుబాటులోకి తెచ్చి యూరియా సరఫరా లోటును పూడుస్తుందని పేర్కొంది.