సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు

CBSE Class 12 board exams 2021 cancelled. కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్రం సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దుచేసింది.

By Medi Samrat  Published on  1 Jun 2021 2:40 PM GMT
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు

కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్రం సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దుచేసింది. పరీక్షల నిర్వహణపై పలుమార్లు చర్చలు జరిపిన కేంద్రం.. తాజాగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమీక్షా సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం​ ప్రకటించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు జరపకపోవడమే మేలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే ముఖ్యమని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా పరీక్షలు రాయాలనుకుంటే, వారికి కరోనా తీవ్రత తగ్గాక పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పరీక్షలకు హాజరు కావాలని విద్యార్థులను బలవంతపెట్టొద్దని పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. భార‌త్‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 19,25,374 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 1,27,510 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,75,044కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 2,795 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,31,895 ల‌కు చేరింది. నిన్న 2,55,287 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,59,47,629 కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 18,95,520 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 92.09శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 8.64 శాతంగా ఉందని.. రోజువారీ పాజిటివిటీ రేటు 6.62శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. టీకా డ్రైవ్‌లో 21,60,46,638 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.




Next Story