ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను విడుదల చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనుంది. కేజ్రీవాల్, సిసోడియాల ప్రమేయాన్ని నిరూపించే బలమైన ఆధారాలు లేవని, వారిపై చేసిన ఆరోపణలు న్యాయపరమైన పరిశీలనలో నిలబడలేదని ట్రయల్ కోర్టు పేర్కొంది. ముఖ్యంగా ఈ కుట్ర సిద్ధాంతానికి సంబంధించి ఎటువంటి నేరపూరిత ఉద్దేశ్యం కనిపించడం లేదని కోర్టు స్పష్టం చేసింది.
అయితే, ఈ కేసులో సుమారు 100 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని, 'సౌత్ లాబీ' ద్వారా ఈ నిధులు అందాయని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో మొత్తం 23 మందిపై సీబీఐ ఛార్జ్‌షీట్లు దాఖలు చేసింది. కుట్రకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను విచారణ సమయంలోనే నిరూపిస్తామని, నిందితులపై చార్జీలు ఫ్రేమ్ చేయడానికి తగినంత సమాచారం తమ వద్ద ఉందని సీబీఐ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు.
మరోవైపు, కోర్టు తీర్పు వెలువడిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనయ్యారు. తాను అవినీతిపరుడిని కాదని, కోర్టు తమను "నిజాయితీపరులు"గా గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. స్వతంత్ర భారత చరిత్రలోనే తమ పార్టీని అంతం చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా కలిసి అతిపెద్ద రాజకీయ కుట్ర పన్నారని కేజ్రీవాల్ విమర్శించారు. సత్యమే గెలుస్తుందని తమకు మొదటి నుంచీ నమ్మకం ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.