ఐసీఐసీఐ బ్యాంకు లోను కేసులో వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ను సీబీఐ అరెస్టు చేసింది. వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు మంజూరు చేసిన రూ.3 వేల కోట్లకుపైగా రుణంలో అవకతవకలు జరిగాయని ఆరోపణల్లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ (59), ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను సీబీఐ గత శుక్రవారం అరెస్టు చేసింది. రెండు రోజుల వ్యవధిలోనే వీడియోకాన్ గ్రూప్ ఛైర్మాన్ వేణుగోపాల్ ధూత్ కూడా అరెస్టయ్యారు. ముంబై కోర్టులో హాజరుపరిచిన తర్వాత వీరిని విచారించనున్నారు. వేణుగోపాల్ ధూత్ ప్రమోట్ చేసిన వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, బ్యాంక్ క్రెడిట్ పాలసీ, ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల లోను మంజూరు చేసిందని సీబీఐ ఆరోపించింది. చందా కొచ్చర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్‌కు డబ్బులు ఇచ్చారని ఆరోపిస్తోంది సీబీఐ.
బ్యాంకు నుంచి లోన్ పొందేందుకు వేణుగోపాల్ అక్రమాలకు పాల్పడ్డాడని సీబీఐ అధికారులు చెప్పారు. వీడియోకాన్ గ్రూపు తరఫున ప్రమోట్ చేసిన పలు కంపెనీల కోసం దాదాపు రూ. 3,250 కోట్లను ఐసీఐసీఐ బ్యాంకు రుణంగా అందజేసిందని వివరించారు. ఇందుకు ప్రతిగా ఐసీఐసీఐ బ్యాంకు నాటి చైర్మన్ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ కు చెందిన కంపెనీల్లో వేణుగోపాల్ రూ.64 కోట్లు పెట్టుబడులు పెట్టారని అధికారులు తెలిపారు.