గత కొద్దిరోజులుగా రుతుపవనాల కారణంగా ముంబైలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్న సంగతి తెలిసిందే. సాధారణంగా భారీ వర్షాల సమయంలో వరదలు వచ్చినప్పుడు కార్లు కూడా కొట్టుకొని వెళ్లడం చూసే ఉంటాం..! కానీ ముంబై క్షణాల్లో ఓ కారు మాయమైపోయింది. 'సింక్ హోల్' కారణంగా కారు చూస్తూ ఉండగానే భూమిలోకి వెళ్ళిపోయింది.
గత కొన్ని రోజులుగా భారీ రుతుపవనాల వర్షం కురుస్తున్న ముంబైలోని ఒక నివాస సముదాయంలో సింక్ హోల్ లోకి పార్క్ చేసిన కారు వెళ్లిపోవడం అందరికీ షాకింగ్ గా అనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. 'ఘట్కో పార్' ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ వింత సంఘటనలో కారు యొక్క బోనెట్ మరియు ముందు చక్రాలు మొదట సింక్ హోల్ లోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించగా.. అలా కారు మొత్తం లోపలికి వెల్లిపోయింది. కారు సమీపంలో ఆపి ఉంచిన ఇతర వాహనాలు, దాని ప్రక్కన ఉన్న కార్లకు ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.
వారాంతంలో ముంబై నగరానికి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. శనివారం నారింజ హెచ్చరిక జారీ చేయగా, ఆదివారం రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షం కారణంగా ముంబై లోని అనేక ప్రాంతాలు నీటితో నిండిపోయాయి.