పంజాబ్ శాసనసభ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం కేంద్ర మంత్రి, బీజేపీ పంజాబ్ ఎన్నికల ఇంచార్జి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశమైన తర్వాత ఆయన పొత్తు విషయాన్ని ప్రకటించారు. గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసిన అనంతరం పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని.. ఇందులో సీట్ల పంపకం పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
మేము సిద్ధంగా ఉన్నాం.. ఈ ఎన్నికలలో విజయం సాధించబోతున్నాము. సీట్ల షేరింగ్‌పై సీట్ టు సీట్ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోబడుతుంది. గెలుపుకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించాల్సిన అవసరం మాకు 101 శాతం ఖచ్చితంగా ఉందని కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. మరోవైపు.. పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ పార్టీతో కలిసి పోటీలో ఉంటామని గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఏడు రౌండ్ల చర్చల తర్వాత.. రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ కలిసి పోటీ చేయబోతున్నాయని నేను ధృవీకరిస్తున్నానని తెలిపారు. సీట్ల వాటా వంటి అంశాలు తరువాత చర్చించబడతాయని అని షెకావత్ విలేకరులతో అన్నారు.