గదిలో ఆడ, మగ ఉంటే తప్పు కాదు.. అలా భావించలేం : హైకోర్టు
Can't presume couple in locked house to be in an immoral relationship. గదిలో ఆడ, మగ ఉంటే నేరం కాదంటూ మద్రాసు హైకోర్టు
By Medi Samrat
గదిలో ఆడ, మగ ఉంటే నేరం కాదంటూ మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. చెన్నైలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉద్యోగి ఇంట్లో.. అదే ప్రాంతానికి చెందిన మహిళా కానిస్టేబుల్ ఉన్న సమయంలో.. పక్కనున్నవారు ఆ ఇద్దరు ఏదో తప్పు చేస్తున్నారేమోనని అనుమానించి ఇంటికి తాళం వేశారు. ఆ తర్వాత పోలీసులకు ఆ విషయమై ఫిర్యాదు చేశారు. ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి తలుపులు తీసి లోపల చూడగా కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ ఉన్నారు.
ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. కానిస్టేబుల్ శరవణబాబుకు, మహిళా కానిస్టేబుల్‌కు అక్రమ సంబంధం ఉన్నట్టు గుర్తించి అతడిని డిస్మిస్ చేశారు. అయితే.. పోలీసుల ఉత్తర్వును సవాలు చేస్తూ.. 1998లో శరవణబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శరవణబాబు వేసిన పిటిషన్‌పై 23 ఏళ్ల పాటు విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి సురేష్ కుమార్ తాజాగా తీర్పు వెలువరించారు.
కానిస్టేబుల్ శరవణబాబు ఇంటికి మహిళా కానిస్టేబుల్ తప్పుచేయాలనే ఉద్దేశంతో వెళ్లిందనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని.. అవివాహితులైన ఆడ, మగ ఓ గదిలో ఉంటే తప్పిదంగా భావించే అవకాశం లేదని.. డిస్మిస్ చేసిన శరవణబాబును మళ్లి విధులలోకి తీసుకోవాలని ఉత్తర్వు జారీ చేశారు. ఆడ, మగ తాళం వేసిన గదిలో ఉంటే అక్కడ వ్యభిచారం జరిగినట్లు భావించలేమని పేర్కొన్నారు. సమాజంలో భిన్న అభిప్రాయాలు ఉన్నందున వాటి ఆధారంగా క్రమశిక్షణా రాహిత్య చర్యలు తీసుకోవడమో, శిక్షించడమో సరికాదని తీర్పు వెలువరించారు.