మహారాష్ట్ర ప్రభుత్వం పడిపోతుందా.? : అస‌లేం జ‌రుగుతుంది.?

Can Maharashtra govt fall. శివ‌సేన నాయ‌కుడు, మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే, పలువురు ఎమ్మెల్యేలు

By Medi Samrat  Published on  21 Jun 2022 2:26 PM GMT
మహారాష్ట్ర ప్రభుత్వం పడిపోతుందా.? : అస‌లేం జ‌రుగుతుంది.?

శివ‌సేన నాయ‌కుడు, మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే, పలువురు ఎమ్మెల్యేలు మంగ‌ళ‌వారం అజ్ఞాతంలోకి వెళ్లడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో రాష్ట్రంలో మెజారిటీని నిలుపుకోవడంలో మహా వికాస్ అఘాడి ప్ర‌భుత్వ సామర్థ్యంపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే షిండేకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల ఖచ్చితమైన సంఖ్య అస్పష్టంగానే ఉంది. రాజకీయ నాయకులు వివిధ సంఖ్యలను ప్రస్తావిస్తున్నారు.

"రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలకు స్వతంత్రులు, చిన్న రాజకీయ పార్టీల నుండి బిజెపికి మద్దతు లభించింది. మాకున్న స‌మాచారం ప్ర‌కారం.. ఏక్నాథ్ షిండేతో 35 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఇదే జ‌రిగితే సాంకేతికంగా రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో ప‌డుతుంది. మైనారిటీలో ఉన్నా.. కానీ ఆచరణాత్మకంగా ప్రభుత్వం ఏర్పడటానికి కొంత సమయం పడుతుందని బిజెపికి చెందిన చంద్రకాంత్ పాటిల్ అన్నారు.

"సుమారు 14-15 మంది ఎమ్మెల్యేలు సూరత్‌లో ఉన్నారు. వారిలో కొందరు తిరిగి వస్తారని మేము ఎదురు చూస్తున్నాము. ప్రస్తుతానికి మాకు ఎటువంటి ప్రణాళిక లేదు. మేము పరిస్థితిని చూస్తున్నాము. బిజెపి ఏది కావాలంటే అది చేయనివ్వండి" అని శివసేన ఎంపి సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు.

శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యేల‌తో అత్య‌వ‌స‌ర‌ సమావేశం నిర్వ‌హించారు. అయితే ఈ స‌మావేశానికి హ‌జ‌రైన ఎమ్మెల్యేల‌ను చూస్తే మెజారిటీ కోల్పోయే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా నొక్కిచెప్పబడ్డాయి. రాష్ట్రంలో శివ‌సేన‌ పార్టీకి మొత్తం 55 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ముంబైలోని ఉద్ధవ్ థాకరే నివాస‌మైన‌ వర్ష నిల‌యం వద్దకు కేవలం 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు.

ఎమ్మెల్యేలు ఎటువైపు ఉన్నార‌నేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇత‌ర‌ శివ‌సేన‌ పార్టీ నాయకులు కూడా సూరత్ వెళ్ళనున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రో శివ‌సేన ఎమ్మెల్యే లతా సోనావానే ఢిల్లీ నుండి సూరత్‌కు వెళ్తున్నట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఇదిలా ఉండగా.. సూరత్‌లో షిండేతో బీజేపీ అగ్రనేతలు త్వరలో సమావేశం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మ్యాజిక్ నంబర్ 144 లేదా 145. ప్రస్తుతం బిజెపి, దాని మిత్రపక్షాలు 106 స్థానాలను కలిగి ఉన్నాయి. శివసేన 55 మంది ఎమ్మెల్యేల‌ను (ఒక ఎమ్మెల్యే మరణించారు) కలిగి ఉంది. కాంగ్రెస్‌కు 44 సీట్లు ఉండగా.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 54 సీట్లు (ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించారు) ఉన్నాయి. దాదాపు 18-20 మంది స్వతంత్రులు లేదా చిన్న పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు.

ప్ర‌స్తుతం మహా వికాస్ అఘాడి 153 సీట్లతో స్పష్టమైన మెజారిటీని కలిగి ఉండగా.. తాజా కుంప‌టితో కొత్త స‌మ‌స్య‌లు తలెత్తాయి. స్వతంత్రులు, చిన్న పార్టీల నుండి బిజెపికి మద్దతు లభిస్తే.. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికల సమయంలో లాగే ప్రయోజనం పొందుతారు. ఏది ఏమైనప్పటికీ.. తాజా ప‌రిస్థితుల‌లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే షిండేతో పాటు అజ్ఞాతంలో ఉన్నారని నమ్ముతున్న తిరుగుబాటు ఎమ్మెల్యేల బాహ్య మద్దతు అవసరమ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.



























Next Story