ఓట‌రు స్నానం చేస్తుండ‌గా వెళ్లిన ఎమ్మెల్యే అభ్య‌ర్ధి.. నెట్టింట న‌వ్వులు పూయిస్తున్న వీడియో..

Campaigning BJP MLA Asks Man, Bathing. ఎన్నికల సంఘం ర్యాలీలను నిషేధించిన విష‌యం తెలిసిందే. దీంతో అభ్యర్థులు

By Medi Samrat  Published on  14 Jan 2022 6:27 AM GMT
ఓట‌రు స్నానం చేస్తుండ‌గా వెళ్లిన ఎమ్మెల్యే అభ్య‌ర్ధి.. నెట్టింట న‌వ్వులు పూయిస్తున్న వీడియో..

ఎన్నికల సంఘం ర్యాలీలను నిషేధించిన విష‌యం తెలిసిందే. దీంతో అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి వెళుతున్నారు. అభ్య‌ర్ధులు త‌మ త‌మ ప్ర‌చారాల‌లో బిజీగా ఉండ‌గా.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్ లో ఓ అభ్య‌ర్ధి ప్ర‌చార‌పు వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఓటరు స్నానం చేస్తుండ‌గా వెళ్లిన‌ అభ్య‌ర్ధి.. అత‌డి స్నానానికి ఆటంకం క‌లిగిస్తూ అడిగిన ప్ర‌శ్న‌లు నెట్టింట న‌వ్వులు పూయిస్తుంది. కాన్పూర్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మైథానీ తన అసెంబ్లీ స్థానంలో ప్రచారం చేస్తుండ‌గా ఈ స‌ర‌దా ఘ‌ట‌న చోటుచేసుకుంది.

వీడియోలో అభ్య‌ర్ధి మైథానీ.. ఒక వ్యక్తి స్నానం చేస్తుండ‌గా మాట్లాడాడు. స్నానం చేస్తుండ‌గా లోపలికి వెళ్లి ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. "అంతా బాగానే ఉంది కదా.. మీ ఇంటి నిర్మాణం దిగ్విజయంగా జ‌రిగింది క‌దా.. మీకు రేషన్ కార్డు ఉందా" అని స్నానం మధ్యలో ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యే అడిగాడు. ఎమ్మెల్యే ప్ర‌శ్న‌ల‌కు ఒంటికి సబ్బు రాసుకుంటున్న ఆ వ్య‌క్తి "అవును, అవును" స‌మాధానం ఇచ్చాడు. ఆ ఫొటోను బీజేపీ ఎమ్మెల్యే తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. "హౌసింగ్ స్కీమ్ కింద ఇంటిని విజయవంతంగా పూర్తి చేసినందుకు నేను ఒక లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి అభినందించాను. నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోమని అత‌డిని అభ్యర్థించాను" అని ఎమ్మెల్యే రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇదిలావుంటే.. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10 నుండి మార్చి 7 మధ్య ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 10న ఫలితాలు ప్రకటించబడతాయి.


Next Story