యువతులు లైంగిక కోరికలను అదుపులో పెట్టుకోవాలి.. హైకోర్టు తీర్పుపై 'సుప్రీం' విమర్శ

యువతులు తమ లైంగిక కోరికలను అదుపులో పెట్టుకోవాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రంగా విమర్శించింది.

By Medi Samrat  Published on  8 Dec 2023 3:02 PM IST
యువతులు లైంగిక కోరికలను అదుపులో పెట్టుకోవాలి.. హైకోర్టు తీర్పుపై సుప్రీం విమర్శ

యువతులు తమ లైంగిక కోరికలను అదుపులో పెట్టుకోవాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రంగా విమర్శించింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఇతరులకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. యుక్తవయస్సులో ఉన్న యువ‌తులు రెండు నిమిషాల ఆనందానికి బదులు.. తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని భాగాలు చాలా అభ్యంతరకరమైనవి.. పూర్తిగా అన్యాయమైనవి అని సుప్రీంకోర్టు పేర్కొంది.

న్యాయమూర్తులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టుకు సహాయంగా సీనియర్ న్యాయవాది మాధవి దివాన్‌ను అమికస్ క్యూరీగా, న్యాయవాది లిజ్ మాథ్యూను అమికస్ క్యూరీకి సహాయంగా సుప్రీంకోర్టు నియమించింది.

ఈ వ్యాఖ్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. బాలల హక్కులను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. వాస్తవానికి హైకోర్టు తీర్పులో.. యువతులు తమ లైంగిక కోరికలను అదుపులో పెట్టుకోవాలని కోరింది. కేవలం రెండు నిమిషాల లైంగిక ఆనందాన్ని ఆస్వాదించడం ద్వారా సమాజం దృష్టిలో ఆమె ఓడిపోతుందని పేర్కొంది.

ఈ తీర్పుపై సుప్రీం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలోని ఇతర పార్టీలకు నోటీసులు జారీ చేసింది. నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేస్తారా లేదా అనేది తెలియజేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరింది.

Next Story