AAP తెచ్చిన లిక్కర్ పాలసీతో రూ.2 వేలకోట్లు నష్టం..ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ రిపోర్టు

By Knakam Karthik  Published on  25 Feb 2025 2:47 PM IST
National News, Delhi Assembly, CAG Report on Delhi Excise Policy, AAP, Bjp, Arvind Kejriwal,

AAP తెచ్చిన లిక్కర్ పాలసీతో రూ.2 వేలకోట్లు నష్టం..ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ రిపోర్టు

ఢిల్లీలో గత ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ తీసుకొచ్చిన మద్యం విధానంపై కాగ్ రిపోర్టు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నివేదికను తాజాగా బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందులోని అంశాలను వెల్లడించింది. 2021-22లో తీసుకొచ్చిన మద్యం విధానం కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2,002 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కాగ్ తేల్చింది. నిపుణుల అభిప్రాయాలు తీసుకోకపోవడం, ఫిర్యాదులు వచ్చినా బిడ్డింగును అనుమతించడం, ఉల్లంఘనలకు జరిమానా వేయకపోవడం, విధానాల రూపకల్పనలో పారదర్శకత లేకపోవడం వంటివి చోటుచేసుకున్నాయని కాగ్ దర్యాప్తులో తేలింది.

కొత్త మద్యం విధానం కారణంగా అప్పటి ప్రభుత్వం రూ.941.53 కోట్ల ఆదాయం కోల్పోయిందని నివేదికలో పేర్కొంది. ఇక, లైసెన్సు ఫీజుల కింద మరో రూ.890.15 కోట్లు నష్టపోయినట్లు తెలిపింది. లైసెన్సుదారులకు మినహాయింపుల రూపంలో మరో రూ.144 కోట్లు కోల్పోయినట్లు వెల్లడించింది.

ఈ నూతన మద్యం విధానాన్ని అప్పటి కేజ్రీవాల్ సర్కారు తీసుకొచ్చింది. దీనిపై విమర్శలు రావడంతో కొన్ని నెలలకే దాన్ని వెనక్కి తీసుకుంది. అనంతరం ఈ వ్యవహారంపై ఈడీ, సీబీఐ కేసులు నమోదయ్యాయి. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మరో సీనియర్ నేత మనీశ్ సిసోడియా జైలుకెళ్లి బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.

Next Story