ఏపీకి సెమీకండక్టర్ ప్రాజెక్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలివే..!
మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By Medi Samrat
మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 18,541 కోట్ల విలువైన పథకాలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. దేశంలో నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులకు దాదాపు రూ.4,594 ఖర్చు చేయనున్నారు. ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి.
లక్నో మెట్రోకు సంబంధించి కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 5,801 కోట్లతో నిర్మించనున్న లక్నో మెట్రో ఫేజ్ వన్ బి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనితోపాటు రూ.8,146 కోట్లతో నిర్మించనున్న క్లీన్ గ్రోత్: టాటో-II జలవిద్యుత్ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మంగళవారం కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్న ఈ నిర్ణయాలను సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద మరో నాలుగు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. SiCSem, కాంటినెంటల్ డివైస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (CDIL), 3D గ్లాస్ సొల్యూషన్స్ ఇంక్ మరియు అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ (ASIP) టెక్నాలజీస్ ప్రాజుక్టులకు అమోదం లభించింది. ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాజెక్టుల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటికి దాదాపు రూ.4,600 కోట్లు వెచ్చించనున్నారు. ఈ ప్రాజెక్టులు 2034 మంది నైపుణ్యం కలిగిన నిపుణులకు ఉపాధిని కల్పిస్తాయి. ఈ ప్రాజెక్ట్ ఎలక్ట్రానిక్ తయారీ పర్యావరణ వ్యవస్థను పెంచుతుంది. దీని వల్ల అనేక పరోక్ష ఉద్యోగాలు కూడా ఏర్పడతాయి. దేశంలో ఇప్పుడు ISM కింద మొత్తం 10 ఆమోదిత ప్రాజెక్టులు ఉన్నాయి. అంతకుముందు ప్రాజెక్టుల కింద 6 రాష్ట్రాల్లో దాదాపు రూ.1.60 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.