ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ ఒలింపిక్ విజేతలకు భారీ నజరానా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు రూ. 2 కోట్లు ప్రకటించగా, పతకాలు సాధించిన మిగతా ఆరుగురికి తలా కోటి రూపాయల చొప్పున నగదు బహుమతి ప్రకటించింది. ఈ సందర్భంగా బైజూస్ ఫౌండర్, సీఈవో బైజు రవీంద్రన్ మాట్లాడుతూ.. జాతి నిర్మాణంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్ గా కూడా వ్యవహరిస్తోంది బైజూస్. అయితే.. తాజాగా బైజూస్ యజమాని రవీంద్రన్ పై కేసు నమోదు అయింది. యూపీఎస్సీ సిలబస్‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారన్న ఆరోపణలతో పై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్రిమోఫోబియా అనే సంస్థ చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద రవీంద్రన్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై బైజూస్ రవీంద్రన్ స్పందిస్తూ.. ఎఫ్‌ఐఆర్ కాపీని తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని తెలిపారు.