నీతి ఆయోగ్ సిఈఓ గా బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం

B.V.R. Subrahmanyam is new CEO of Niti Aayog

By Medi Samrat  Published on  21 Feb 2023 5:38 PM IST
నీతి ఆయోగ్ సిఈఓ గా బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం

మాజీ ఐఎఎస్ అధికారి బీవీఆర్‌ సుబ్రహ్మణ్యంను నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఈఓ)గా ప్రభుత్వం సోమవారం నియమించింది. ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులైన పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం తెలుగు వ్యక్తే..! నీతి ఆయోగ్‌ సీఈవోగా రెండేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సుబ్రహ్మణ్యం కొనసాగుతారు. “శ్రీ బివిఆర్ సుబ్రహ్మణ్యం, ఐఎఎస్ (రిటైర్డ్.)ని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, వైస్ శ్రీ పరమేశ్వరన్ అయ్యర్, వాషింగ్టన్ డిసి, యుఎస్‌ఎలోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించిన తర్వాత నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి రెండేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన విధులు నిర్వర్తించనున్నారు” అని ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2004-2008, 2012-2015 మధ్య ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ హయాంలో కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు. జమ్మూకశ్మీర్ ప్రధాన కార్యదర్శిగా, ప్రధానమంత్రి కార్యాలయంలో డైరెక్టర్ గా, జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. లాల్‌బహదూర్‌శాస్త్రి ఐఏఎస్‌ అకాడమీకి డిప్యూటీ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు. బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం పూర్తి పేరు భమిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం. ఈయన తండ్రిది ఒడిశాలోని గుణుపురం కాగా, తల్లి ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు చెందినవారు. విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీలో చదువుకున్నారు. ఢిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో మెకానికల్‌ బ్రాంచ్ లో బీటెక్‌ చేశారు. లండన్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ పట్టా కూడా పొందారు.


Next Story