Delhi Blast : ఆ బిల్డింగ్‌లోనే పేలుళ్ల కుట్రకు ప్లాన్..?
ఢిల్లీ పేలుడు కేసును ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసును ఫరీదాబాద్ మాడ్యూల్ కాకుండా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
By - Medi Samrat |
ఢిల్లీ పేలుడు కేసును ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసును ఫరీదాబాద్ మాడ్యూల్ కాకుండా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఉగ్రవాదులు డాక్టర్ ఉమర్, డాక్టర్ ముజమ్మిల్ డైరీలను దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తు సందర్భంగా అల్ ఫలాహ్ యూనివర్సిటీలోని రూమ్ నంబర్ 4, రూమ్ నంబర్ 13 నుంచి రెండు డైరీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీల్లో కొన్ని రహస్య సంకేతాలు కూడా రాసి ఉన్నట్లు గుర్తించారు. దీంతో వీరికి ఢిల్లీ పేలుళ్ల కేసుతో సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యూనివర్సిటీలోని బిల్డింగ్ 17లో ఉమర్ రూమ్ నంబర్ 4, ముజమ్మిల్ రూమ్ నంబర్ 13 నుంచి డైరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు డైరీల్లోనూ 25 మంది పేర్లు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది జమ్మూ కాశ్మీర్, ఫరీదాబాద్ నివాసితులు.
అదే సమయంలో ఈ డైరీల్లో నవంబర్ 8 నుంచి నవంబర్ 12 వరకు తేదీలను కూడా ప్రస్తావించారు. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర పేలుడు జరిగిన తేదీ నవంబర్ 10 కావడం విశేషం. ఈ డైరీలో ఆపరేషన్ అనే పదాన్ని పదేపదే ఉపయోగించారు. డాక్టర్ ముజమ్మిల్ నివసించిన గది నుండి పోలీసులు 360 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో ఐ20, ఎకో స్పోర్ట్‌తో పాటు మరో రెండు వాహనాలను పేలుడుకు సిద్ధం చేసినట్లు విచారణలో తేలింది. పెద్దఎత్తున దాడి చేయడమే ఉగ్రవాదుల లక్ష్యం.
ఈ డాక్టర్ మాడ్యూళ్లకు చెందిన ఉగ్రవాదులు దేశంలోని నాలుగు నగరాలను టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతున్నారని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రతి గ్రూపుకు ఒక నగరంలో పేలుళ్లు జరిపే బాధ్యతను అప్పగించారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. నిందితులు రెండు జంటలుగా వేర్వేరు నగరాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులోని ప్రతి గ్రూపు ఐఈడీతో దాడికి ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.