పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు తీవ్ర కసరత్తులు
Budget Session of Parliament to begin on January 31. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి.
By Medi Samrat Published on 14 Jan 2022 6:28 PM ISTపార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 8 వరకు పార్లమెంట్ ఉభయ సభలు పనిచేయనున్నాయి. ఈ సారి రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి దశ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనుంది. ఆ తర్వాత మార్చి 14న రెండో దశ సమావేశాలు ప్రారంభమై ఏప్రిల్ 8న ముగియనున్నాయి. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పిటికే అన్ని ఇతర శాఖల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో సామాన్యులకు ఊరట లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కరోనా నేఫథ్యంలో చిరు వ్యాపారులకు ఉద్దీపన ప్యాకేజీలు సైతం ప్రకటించే అవకాశముంది.
కరోనా మూడో వేవ్ మధ్య బడ్జెట్ సమవేశాలు నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే 400 మందికిపైగా పార్లమెంట్ సిబ్బంది కొవిడ్ బారిన పడిన నేపథ్యంలో షిఫ్డుల వారీగా ఉభయ సభలు నిర్వహించే అంశాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. రాజ్య సభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుందని, లోక్ సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగొచ్చని వార్తలు వస్తున్నాయి. బడ్జెట్ రోజు మాత్రం ఇందుకు మినహాయిపు ఉండనుంది. ఈ సారి సెషన్స్ లో కూడా కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్క్లు ధరించడం వంటి నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నారు.
బడ్జెట్ సమావేశాల నిర్వహణ కోసం పార్లమెంట్‌లో శానిటేషన్ పనులు, ఇతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పరిశీలించారు. ఈ సందర్భంగా 60 ఏళ్లు పైబడిన ఎంపీల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.