భారత్, పాకిస్తాన్ దేశ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి భారత్, పాక్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ ప్రాంతంలో తక్కువ ఎత్తులో ఎగురుతున్న పాకిస్థాన్ డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) అడ్డుకుని కూల్చివేసింది. బీఎస్‌ఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. డ్రోన్ చైనాలో తయారు చేయబడింది. పాకిస్తాన్ వైపు నుండి భారత భూభాగంలోకి ప్రవేశించింది. సీనియర్ బీఎస్‌ఎఫ్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఘటనా ప్రాంతంలో దర్యాప్తు కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఒక అధికారి తెలిపారు. అమర్‌కోట్‌లోని బోర్డర్ ఔట్ పోస్ట్‌లో అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్ పెట్రోలింగ్ బృందం రాత్రి 11.10 గంటల సమయంలో డ్రోన్ సౌండ్ వినిపించిందని తెలిపింది. డ్రోన్ తక్కువ ఎత్తులో ఎగిరింది. అది అంతర్జాతీయ సరిహద్దు నుండి సుమారు 300 మీటర్లు, సరిహద్దు భద్రతా కంచె నుండి 150 మీటర్ల దూరంలో గుర్తించబడింది. డ్రోన్ బీఎస్‌ఎఫ్ స్వాధీనం చేసుకుంది.
"డిసెంబర్ 17న, సుమారు 23.10 గంటల సమయంలో, బోర్డర్ అవుట్ పోస్ట్ వాన్, అమర్‌కోట్‌లోని భద్రతా దళాలు సరిహద్దు భద్రతా కంచె నుండి 150 మీటర్ల దూరంలో డ్రోన్‌ను గుర్తించి కూల్చివేసాయి. అప్రమత్తమైన దళాలు సరిహద్దు నేరస్థుల ప్రయత్నాన్ని మరోసారి విఫలం చేశాయి. సరిహద్దు అవతల నుండి మాదక ద్రవ్యాలు లేదా ఆయుధాలను వదలడానికి ఉపయోగించిన డ్రోనా.. కాదా అని తెలుసుకోవడానికి బీఎస్‌ఎఫ్ బృందాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని అధికారి తెలిపారు.