కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్ప మనవరాలు శుక్రవారం తన నివాస గృహంలో అనుమానస్పద స్థితిలో శవమై కనిపించింది. మృతురాలు పేరు సౌందర్య కాగా.. ఆమె యడియూరప్ప రెండో కుమార్తె పద్మావతి కూతురు. ఉదయం 10.30 గంటల సమయంలో ఇంటి పనిమనిషి ఆమెను అల్పాహారం కోసం లేపేందుకు వెళ్లగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సౌందర్య గది తలుపులు ఎంతకూ తీయకపోవడంతో సహాయకురాలు ఇతరులకు సమాచారం అందించింది. అపార్ట్‌మెంట్ సిబ్బంది వచ్చి తలుపులు పగులకొట్టి బాల్కనీ సీలింగ్‌కు వేలాడుతున్న సౌందర్యను చూసి పోలీసులకు సమాచారం అందించాడు.
సౌందర్య, ఆమె భర్త నీరజ్‌లు రెండున్నరేళ్ల నుంచి ఆ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణ జరుగుతోంది. సౌందర్యకు నాలుగు నెలల పాప ఉంది. యడియూరప్ప కార్యాలయం తెలిపిన ప్రకారం.. సౌందర్య ప్రసవానంతర డిప్రెషన్‌తో బాధపడుతోంది. దీని కోసం చికిత్స కూడా పొందుతోంది. సౌందర్య ఎంఎస్ రామయ్య హాస్పిటల్‌లో వైద్యురాలుగా పనిచేస్తుంది. సౌందర్య, భర్త నీరజ్‌ను 2019లో వివాహం చేసుకున్నారు. వసంత్ నగర్ సమీపంలోని యడియూరప్ప ప్రైవేట్ నివాసానికి దగ్గరగా ఆమె ఉంటున్నారు.సౌందర్య మరణ వార్త తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై యడియూరప్పను ఓదార్చడానికి ఆసుపత్రికి చేరుకున్నారు. సెంట్రల్ బెంగళూరు డీసీపీ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం సౌందర్య మృతిపై విచారణ చేస్తొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.