ఢిల్లీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరాహార దీక్ష విజయవంతం అయింది. సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్సీ కవితకు ఎంపీ కే కేశవరావు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. పార్లమెంట్ లో వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని, మహిళా సాధికారత దిశగా చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో కవిత పాల్గొన్నారు.
ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదని.. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం మా పోరాటం కొనసాగుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ సాధించే వరకు విశ్రమించేది లేదని.. మోదీ సర్కార్ తలచుకుంటే ఈ బిల్లు పాసవుతుందన్నారు. డిసెంబర్‌లో పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు పోరాడుతూనే ఉంటాము. ఈ పోరాటం ఇంకా ఉధృతమవుతుంది. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరం.. సాధించి తీరాలి అని కవిత స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేపట్టిన దీక్షకు మద్దతు ఇచ్చిన పార్టీలకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీక్షకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఢిల్లీ మహిళా నేతలకు, విద్యార్థి నేతలకు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు కవిత.