పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి పీటలపై కూర్చొని దండలు మార్చుకుంటుండగా వధువుకు గుండెపోటు వచ్చింది. దీంతో వధువు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో పెళ్లి మండపం విషాదకరంగా మారింది. అప్పటి వరకు కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆనందం ఆవిరైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లాలో జరిగింది. మలిహాబాద్‌లోని భద్వానా గ్రామంలో రాజ్‌పాల్ అనే వ్యక్తి కూతురు శివంగికి పెళ్లి జరిగింది. వివాహం తర్వాత వధూవరులు ఊరేగింపుగా బయల్దేరారు. ఊరేగింపులో నృత్యాలు చేశారు. ఊరేగింపు ముగిసిన తర్వాత పెళ్లి వేదికపై వధూవరులు దండలు మార్చుకున్నారు. అదే సమయంలో వధువు శివంగికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.
మలిహాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుభాష్ చంద్ర సరోజ్ మాట్లాడుతూ.. ఈ సంఘటన గురించి సోషల్ మీడియా ద్వారా తమకు తెలిసిందని, తరువాత విచారణ కోసం ఒక బృందాన్ని గ్రామానికి పంపామని చెప్పారు. "సమాచారం ప్రకారం.. భద్వానా గ్రామానికి చెందిన రాజ్‌పాల్ కుమార్తె శివాంగి వివాహం వివేక్‌తో జరుగుతోంది. వధువు వేదికపైకి చేరుకుని వరుడికి పూలమాల వేసింది. కొన్ని సెకన్ల తరువాత ఆమె వేదికపై కుప్పకూలిపోయింది. ఇది అతిథులలో భయాందోళనలకు దారితీసింది" అని ఎస్‌హెచ్‌వో తెలిపారు. శివంగిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, అక్కడి నుంచి ట్రామా సెంటర్‌కు తరలించారు. అయితే అప్పటికే వధువు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.