కేరళలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పోటెత్తుతోంది. భారీ వరదలతో అక్కడి రోడ్లు మొత్తం నీట మునిగాయి. ఇప్పటికే చాలా మంది వరదల్లో గల్లంతు అయ్యారు. భారీ వర్షాలకు కేరళ ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. అయితే ఇవేమీ తమ పెళ్లికి అడ్డు కాదని భావించారు తలవడికి చెందిన నూతన వధూవరులు. నిర్ణయించిన ముహూర్తానికి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అప్పటికే రోడ్డు మొత్తం నీట మునగడంతో పెద్ద వంట పాత్రలో కూర్చొని పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కళ్యాణ వేదిక చేరుకున్నారు.
నీటితో నిండి ఉన్న కళ్యాణ వేదిక వద్ద అతి తక్కువ మంది బంధు, మిత్రుల మధ్య పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరోనా మహమ్మారి కారణంగా పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులను పెళ్లికి ఆహ్వానించామని నూతన వధూవరులు తెలిపారు. కొద్ది రోజుల కిందట కళ్యాణ వేదిక నీళ్లు లేవు.. అయితే గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆ ప్రాంతం నీట మునిగింది. ఈ కొత్త పెళ్లి జంట చెంగనూరులోని ఓ ఆస్పత్రిలో ఆరోగ్య కార్యకర్తలుగా పని చేస్తున్నారు.