థానే హనుమాన్ ఆలయంలో హుండీని దొంగిలించిన వ్యక్తిని నౌపారా పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన దృశ్యం పోలీసులను ఆశ్చర్యపరిచింది. ఆలయంలోని హుండీని దొంగిలించే ముందు నేరస్థుడు దేవుని పాదాలను తాకినట్లు కనిపిస్తాడు. నౌపారా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖోపట్ బస్ డిపో సమీపంలోని కబీర్‌వాడి హనుమాన్ ఆలయ పూజారి మహంత్ మహావీర్ దాస్ గురువారం జరిగిన ఈ ఘటనపై తమకు సమాచారం అందించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 9:30 గంటల మధ్య ఆలయంలో చోరీ జరిగినట్లు ఫిర్యాదుదారు తన వాంగ్మూలంలో తెలిపారు. పూజారి ఏదో పని నిమిత్తం ఆ సమయంలో ఆలయం నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి విగ్రహం ముందు భాగంలో ఉన్న హుండీ కనిపించలేదు.
విరాళంలో 1,000 రూపాయలు ఉన్నాయని పండిట్ తెలిపారు. ఆలయంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అందులో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గుడి లోపలికి ఒక వ్యక్తి వచ్చి.. తన మొబైల్ నుంచి ఆలయ ఫొటో కూడా తీశాడు. అతడు దేవుని పాదాలను తాకి, వెంటనే విరాళాల పెట్టెతో బయటకు పారిపోయాడు. గుడి బయట ఉన్న సీసీటీవీలో అతను గుడి బయట వేచి ఉన్నట్టు తెలిసింది. నౌపారా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ ధుమాల్ మాట్లాడుతూ, "మేము ఆలయం చుట్టూ ఉన్న వ్యక్తులను విచారణ చేసాము. CCTV ఫుటేజీని స్థానికులతో పంచుకున్నాము.. అది నేరస్థుడిని గుర్తించడంలో సహాయపడింది" అని తెలిపారు.