Both Houses Adjourned till March 15. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మూడో రోజు సమావేశమైన పార్లమెంట్
By Medi Samrat Published on 10 March 2021 12:19 PM GMT
రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మూడో రోజు సమావేశమైన పార్లమెంట్.. విపక్షాల ఆందోళనలతో అట్టుడికింది. సాగు చట్టాలు, చమురు ధరల పెరుగుదలపై నిరసనలతో లోక్‌సభ, రాజ్యసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. కరోనా వైరస్ తో దేశం అట్టుడికి పోతుంటే.. మరోవైపు చమురు ధర విపరీతంగా పెరుగుతూ వచ్చిందని ఫైర్ అయ్యాయి విపక్షాలు.
మూడో రోజు లోక్‌సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు.. వివిధ సమస్యలపై చర్చించాలని నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా పలు మార్లు విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో లోక్ సభను మధ్యాహ్నం 12:30 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనప్పటికీ ఆందోళనలు కొనసాగించారు విపక్ష నేతలు. దాంతో సభను మార్చి 15 వరకు వాయిదా వేశారు స్పీకర్.
రాజ్యసభలోనూ సాగు చట్టాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దాంతో తొలుత సభ 12 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన కొద్దిసేపటికే 2 గంటల వరకు వాయిదా వేశారు. విపక్షాలు ఆందోళన విరమించకపోవటం వల్ల సభ ఈనెల 15 వరకు వాయిదా పడింది.