చాహల్, ధనశ్రీల విడాకులపై రేపటిలోగా తుది నిర్ణయం తీసుకోండి : బాంబే హైకోర్టు
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకుల పిటిషన్‌పై మార్చి 20లోగా నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది.
By Medi Samrat
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకుల పిటిషన్‌పై మార్చి 20లోగా నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. విడాకులపై తుది నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును హైకోర్టు కోరింది. కాగా.. దంపతులిద్దరూ చాలా కాలంగా విడివిడిగా జీవిస్తున్నారు.
6 నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను కూడా హైకోర్టు రద్దు చేయడం గమనార్హం. ఇందుకోసం ఇద్దరూ పరస్పర అంగీకారంతో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. విడాకుల కోసం పరస్పర పిటిషన్ దాఖలు చేసిన తర్వాత.. రాజీ, పునరేకీకరణ కోసం 6 నెలల సమయం ఇవ్వబడుతుంది.. అలాంటి అవకాశం కనిపించనప్పుడు దానిని కోర్టు మాఫీ చేయవచ్చు.
చాహల్-ధనశ్రీ వర్మ ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్‌ను దాఖలు చేశారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నందున కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను మినహాయించాలని కోరుతూ ఇరువురు పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఫిబ్రవరి 20న కుటుంబ న్యాయస్థానం దానిని మాఫీ చేసేందుకు నిరాకరించింది.
దీంతో కుటుంబ న్యాయస్థానం ఆదేశాలను వారిద్దరూ హైకోర్టులో సవాల్ చేశారు. హిందూ వివాహ చట్టం ప్రకారం.. విడాకులు మంజూరు చేయడానికి ప్రతి జంట ఆరు నెలల ముందు కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను గడపాలి. ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జామ్‌దార్ అనుమతించారు.
పిటిషనర్ నంబర్ 1 (చాహల్) ఐపీఎల్‌లో పాల్గొంటున్నందున మార్చి 21 తర్వాత తను అందుబాటులో ఉండకపోవచ్చని న్యాయవాది తెలియజేసినట్లు హైకోర్టు పేర్కొంది. కాబట్టి, వారి విడాకుల పిటిషన్‌పై రేపటిలోగా (మార్చి 20) నిర్ణయం తీసుకోవాలని కుటుంబ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మార్చి 25న పంజాబ్ కింగ్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుత సీజన్‌లో యుజ్వేంద్ర చాహల్ పంజాబ్‌కు ఆడుతున్నాడు. ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మరో రెండు నెలల పాటు ఈ టోర్నీలో చాహల్ బిజీగా ఉండనున్నాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పిటిషన్‌పై మార్చి 20న తుది తీర్పును వెలువరించాలని హైకోర్టు.. ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది