న్యూఢిల్లీ జిల్లా చాణక్యపురి ప్రాంతంలో ఉన్న తమిళనాడు హౌస్‌కు బాంబు బెదిరింపు రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ బెదిరింపు ఈ-మెయిల్ ద్వారా పంపబడింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులతో పాటు మూడు ఫైర్ టెండర్లు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇతర ఏజెన్సీలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. తమిళనాడు భవనాన్ని వెంటనే ఖాళీ చేయించారు.
దాదాపు రెండు గంటలపాటు గాలింపు చర్యలు చేపట్టినా అనుమానస్పదంగా ఏమీ దొరకలేదు. ఆ తర్వాత భద్రతా సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇది ఫేక్ కాల్ అని నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ఈ మెయిల్ పంపిన వారిని వెతికే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
సమాచారం ప్రకారం.. శనివారం ఉదయం 10:00 గంటలకు తమిళనాడు హౌస్‌కి ఒక మెయిల్ వచ్చింది. అందులో బాంబు బెదిరింపు గురించి రాసి ఉంది. తమిళనాడు హౌస్‌లో ఐఈడీ అమర్చినట్లు మెయిల్‌లో రాశారు. ఈ మెయిల్ చూసిన తమిళనాడు హౌస్ మెయింటెనెన్స్ చూస్తున్న వ్యక్తులు వెంటనే పోలీసులకు, ఇతర ఏజెన్సీలకు సమాచారం అందించారు. అయితే దాదాపు రెండు గంటల పాటు జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.