దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరగడంతో టమాట దొంగతనం కేసులు పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరులోని యలహంక సమీపంలోని చిక్కజాల గ్రామం సమీపంలో టమాటాలను రవాణా చేస్తున్న బొలెరో వాహనం చోరీకి గురైంది. వివరాళ్లోకెళితే.. శనివారం ఓ రైతు తాజాగా పండించిన టమోటాలను హిరియూరు నుంచి కోలారుకు తరలిస్తున్నాడు. దారిలో ఉండగా.. ముగ్గురు వ్యక్తులతో ఒక కారు.. టొమాటో సరుకును తీసుకువెళుతున్న బొలెరో వాహనాన్ని అనుసరించడం ప్రారంభించింది. పీణ్య సమీపంలో తమ కారును రైతు వాహనం ఢీకొట్టిందని ఆరోపిస్తూ.. ఆర్‌ఎంసీ యార్డు పోలీస్‌స్టేషన్ పరిధిలో బొలెరోను కారులో ప్రయాణిస్తున్న వారు అడ్డుకున్నారు. వాగ్వాదం పెరగడంతో రైతుపై దాడి కూడా చేసినట్లు చెబుతున్నారు.
వాహనం కారును ఢీకొట్టిందని డబ్బులు డిమాండ్ చేసిన దుండగులు.. బొలెరో వాహనాన్ని,రైతును, డ్రైవర్‌ను తమ వెంట తీసుకుని చిక్కజాల వైపు వెళ్లారు. అయితే డబ్బులు లేవని గ్రహించి రైతును చిక్కజాల సమీపంలో వదిలి.. డ్రైవర్‌తో పాటు రెండు వేల కిలోల టమాట లోడ్ తో పరారయ్యారు. ఈ ఘటనపై స్పందించిన ఆర్‌ఎంసి వార్డు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. టమాటా చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించి ఆచూకీ కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.