మెడికల్ కాలేజికి విరాళంగా నవీన్ భౌతికకాయం
Body of Indian student killed in Ukraine to be donated to medical college after last rites.ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన
By తోట వంశీ కుమార్ Published on 19 March 2022 11:36 AM ISTఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక దాడి ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ యుద్దంలో ఎందరో అమాయకపు ప్రజలు తమ ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఆక్రమించుకునేందుకు రష్యా సేనలు యత్నిస్తుండగా.. వాటిని సమర్థవంతంగా ఉక్రెయిన్ దళాలు తిప్పికొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరంలో మార్చి 1న మృతి చెందిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ మృతదేహాం 20 రోజుల తరువాత సోమవారం బెంగళూరు చేరుకోనుంది. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మె శుక్రవారం సాయంత్రం సోసల్ మీడియా ద్వారా వెల్లడించారు. సోమవారం ఉదయం 3 గంటలకు నవీన్ మృతదేహాం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటుందని తెలిపారు.
కాగా.. తమ కుమారుడి మృతదేహాన్ని వైద్య పరిశోధన కోసం దానం చేయాలని నిర్ణయించుకున్నామని నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ తల్లిదండ్రులు తెలిపారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో నవీన్ తండ్రి శంకరప్ప మాట్లాడుతూ.. నవీన్ వైద్య రంగంలో ఏదైనా సాధించాలనుకున్నాడు, అది జరగలేదన్నారు. కనీసం అతని శరీరాన్ని ఇతర వైద్య విద్యార్థులు చదువుకు ఉపయోగించవచ్చునని బావించాం. అందుకనే ఇంట్లో అందరం చర్చించుకుని నవీన్ శరీరాన్ని దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
ఇక తన కుమారుడి మృతదేహాం 21వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు బెంగళూరు చేరుకుంటుందని.. అక్కడి నుంచి ఉదయం 9 గంటలకు స్వగ్రామానికి చేరుకుంటుందన్నారు. అనంతరం వీరశైవ సంప్రదాయం ప్రకారం పూజలు చేసి ప్రజల సందర్శనార్థం ఉంచుతామని చెప్పారు. అనంతరం వైద్య విద్య కోసం మృతదేహాన్ని దావణగెరెలోని ఎస్ఎస్ ఆస్పత్రికి దానం చేయనున్నట్లు నవీన్ తండ్రి శంకరప్ప తెలిపారు.
కర్ణాటకలోని హవేరీ జిల్లాకు చెందిన నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ ఉక్రెయిన్ నగరంలోని ఖర్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో చివరి సంవత్సరం చదువుతున్నాడు. మార్చి 1న ఆహారం కొనుగోలు చేసేందుకు ఓ సూపర్ మార్కెట్ ముందు నిలబడి ఉండగా.. రష్యా చేసిన షెల్లింగ్‌లో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మె నవీన్ శేఖరప్ప కుటుంబానికి రూ.25 లక్షల చెక్కును అందజేసి కుటుంబ సభ్యునికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.