ఎంబసీపై దాడి జరుగుతుందని ముందే ఊహించారట

Blast near Israeli Embassy may be connected to 2012 attack on diplomats. దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార

By Medi Samrat  Published on  30 Jan 2021 9:52 AM GMT
ఎంబసీపై దాడి జరుగుతుందని ముందే ఊహించారట

దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడు ఘటనలో దర్యాప్తు వేగవంతమైంది. ఎంబసీపై దాడి ఆశ్చర్యానికి గురిచేయలేదని భారత్ లో ఇజ్రాయెల్ రాయబారి రోన్ మల్కా చెప్పుకొచ్చారు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని అన్ని ఇజ్రాయెల్ ఎంబసీలనూ లక్ష్యం చేసుకున్నారని.. శుక్రవారం నాటి దాడిపై భారత్ తో కలిసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇది ఉగ్రవాద దాడేనన్నారు. ఎంబసీలోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని ఎంబసీ 29వ వార్షికోత్సవమని, కాబట్టి ఈ దాడి ఉద్దేశపూర్వకంగా చేసిందే అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

బాంబు దాడి చేసిందెవరో తేల్చే పనిలో పడ్డామని ఆయన అన్నారు. ఇటు యూరప్ లోని ఎంబసీలపైనా దాడులు చేసే అవకాశాలున్నాయని చెప్పారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇజ్రాయెల్ ఎంబసీల వద్ద హై అలర్ట్ విధించామన్నారు. దౌత్యవేత్తలు, ఎంబసీకి సరైన భద్రత కల్పించేందుకు భారత్ హామీ ఇచ్చిందన్నారు. ఇజ్రాయెల్ ఎంబసీలు, హై కమిషన్లకు ఎప్పుడూ ముప్పే. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఏదో ఒక ఎంబసీ వద్ద ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి జరుగుతుందని ముందే ఊహించాం. అందుకే గత వారం రోజులుగా హై అలర్ట్ లోనే ఉన్నామని ఆయన చెప్పారు.

ఈ కేసు విషయంలో ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడుకు ముందు ఇద్దరు వ్యక్తులు క్యాబ్‌లో వచ్చి అక్కడ దిగినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వీరికి ఈ పేలుడుతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికే క్యాబ్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. డ్రైవర్‌ చెప్పిన వివరాల ఆధారంగా అనుమానితుల ఊహాచిత్రాలను గీయించేందుకు ప్రయత్నిస్తున్నారు. పేలుడులో అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఈ పేలుడు ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. పేలుడు సంభవించిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న ఓ చెట్టుకు కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది. ఆ సీసీ పుటేజీని పరిశీలించగా, టైమ్‌ స్టాప్ 19:70గా ఉండటం గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.


Next Story