కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ల టెన్షన్ ఓ వైపు దేశ వైద్య విభాగాన్ని హడలెత్తిస్తుండగా.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కలకలం మొదలైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. సెకండ్ వేవ్ సమయంలో బ్లాక్ ఫంగస్ ఎన్నో కష్టాలకు గురిచేసింది. ఇప్పుడు థర్డ్ వేవ్ సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్‌తో లక్షణాలతో సోమవారం ఆసుపత్రిలో చేరాడు. అతడి ఒక కన్ను, ముక్కుకు బ్లాక్ ఫంగస్ వ్యాపించింది. కరోనా థర్డ్ వేవ్ లో ఇదే తొలి కేసు అని అధికార వర్గాలు తెలిపాయి. కాంట్ ప్రాంతానికి చెందిన 45 సంవత్సరాల వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకిందని, అతనికి మధుమేహం ఉందని జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీ అధికారులు తెలిపారు.
కంట్లో నొప్పిగా ఉందని ఆ వ్యక్తి వచ్చాడని, అతడికి టెస్టు చేయగా, కరోనా సోకినట్లు తేలిందని డాక్టర్ తెలిపారు. షుగర్ కారణంగా ఆ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు భావిస్తున్నామన్నారు. బాధితుడిని బ్లాక్ ఫంగస్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సెకండ్ వేవ్ సమయంలో పెద్ద సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూశాయి. ఫంగస్ కారణంగా పలువురు కంటి చూపును సైతం కోల్పోయారు. మరోసారి బ్లాక్ ఫంగస్ కేసు నమోదవడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.