భోపాల్ పార్లమెంటు సభ్యురాలు సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌కు అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు పంపినందుకు ఇద్దరు యువకులను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని సిక్రీలో సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ రిమాండ్‌పై భోపాల్‌కు తీసుకువచ్చారు. 8 రోజుల క్రితం, తన పరువు, ప్రతిష్టను చెడగొట్టడానికి కుట్ర పన్నారని ఆరోపిస్తూ భోపాల్‌లోని టిటి నగర్‌లో ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు రవీన్ (23), అతని సోదరుడు వారిస్ (21) లను అదుపులోకి తీసుకున్నారు. రవీన్, వారిస్ చదువుకోకపోయినా సైబర్ క్రైమ్ చేయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు.
సోమవారం మధ్యాహ్నం భోపాల్ సబ్ ఇన్‌స్పెక్టర్ దేవేంద్ర సాహు, అతని బృందం సిక్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చి చందా కా బస్ బన్ని కుగ్రామానికి చేరుకుని ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తనకు అభ్యంతకర వీడియోలను పంపుతూ, బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనపై ప్రగ్యా ఠాకూర్ ఫిబ్రవరి 7 న సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వాట్సాప్‌లో వీడియో కాల్ వచ్చిందని ఠాకూర్ తెలిపారు. ఆమె ఫిర్యాదు ప్రకారం, ఆమెకు వీడియో కాల్ చేసిన ఒక మహిళ తన బట్టలు విప్పేసింది, ఆ తర్వాత ఎంపీ కాల్ డిస్‌కనెక్ట్ చేసింది. కొంత సమయం తరువాత, తన నుండి డబ్బులు డిమాండ్ చేస్తూ వేరే నంబర్ నుండి కాల్ వచ్చిందని, డబ్బు చెల్లించకుంటే ఆ అమ్మాయితో ఎంపీ మాట్లాడిన వీడియోను పబ్లిక్‌గా పెడతానని బెదిరించారని ప్రగ్యా ఠాకూర్ టిటి నగర్ పోలీసులకు సమాచారం అందించారు.