గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ మేనిఫెస్టో చూశారా..?
BJP's Manifesto For Gujarat Polls. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది.
By M.S.R Published on 26 Nov 2022 12:46 PM GMTగుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. భారీ హామీలను బీజేపీ గుప్పించింది. ఉచితాలకు పెద్ద పీట వేయకుండా.. అభివృద్ధే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించారు. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.
గాంధీనగర్ లో జరిగిన కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ మేనిఫెస్టోను విడుదల చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గాంధీనగర్‌లోని రాష్ట్ర కార్యాలయంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కోసం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడానికి ముందు వీడియోను రిలీజ్ చేశారు. నడ్డా మాట్లాడుతూ.. రాజ్యాంగానికి సంబంధించి అంకితభావం ఉన్నవాళ్లమని.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ పాలనలో గుజరాత్ నిరంతరం అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి బీజేపీ మాత్రమే చేయగలదని, వివక్షకు తావులేకుండా అన్ని వర్గాల అభ్యున్నతి, అభివృద్ధికి తమ పార్టీ కృషి చేస్తుందన్నారు. యూనిఫాం సివిల్ కోడ్‌తో పాటు ఐదేళ్ల కాలంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. రాడికలైజేషన్ సెల్, పబ్లిక్ , ప్రైవేట్ ప్రాపర్టీస్ డ్యామేజెస్ రికవరీ యాక్ట్ తీసుకవస్తామని హామీ ఇచ్చింది.
ఆయుష్మాన్ భారత్ కింద వార్షిక బీమా మొత్తం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంపు
మహిళలు, వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణాలు
ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఆర్థిక సాయం
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు
బాగా చదివే కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు
ఉమ్మడి పౌరస్మృతి అమలు
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన
మహిళలకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక వసతులకు రూ. 10 వేల కోట్ల కేటాయింపు
విద్యార్థినులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
రూ. 10 వేల కోట్లతో రాష్ట్రంలోని 20 వేల స్కూళ్ల అభివృద్ధి
2036లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహణకు గాను గుజరాత్ ఒలింపిక్ మిషన్ ప్రారంభిస్తాం
ఉగ్రముప్పు నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు యాంటీ రాడికలైజేషన్ యూనిట్ ఏర్పాటు