కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అంగీకరించారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తమ పార్టీ నాయకులు ఎంతో ప్రయత్నించామని.. కానీ గెలవలేకపోయామని చెప్పారు. ఈ ఫలితాలను విశ్లేషించుకొని, లోక్ సభ ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చిన తర్వాత మేము సమగ్ర విశ్లేషణ చేస్తామని.. జాతీయ పార్టీగా వివిధ స్థాయిల్లో ఎలాంటి లోటుపాట్లు, ఉన్నాయో విశ్లేషించుకుంటామని బొమ్మై చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో తిరిగి పుంజుకుంటామని బసవరాజ్ బొమ్మై మీడియాతో అన్నారు.
బీజేపీ విజయంపై తనకు నమ్మకం ఉందని బొమ్మై గతంలో చెప్పారు. కాంగ్రెస్, తన శాసనసభ్యులపై విశ్వాసం లేనందున ఇతర పార్టీలను చేరుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. 113 మెజారిటీ మార్కును కాంగ్రెస్ అధిగమించింది. ఆ పార్టీ ప్రస్తుతం 130 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. చాలా ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీని అంచనా వేసింది. కింగ్ మేకర్ అవుతుందని భావించిన హెచ్‌డి కుమారస్వామికి చెందిన జనతాదళ్ సెక్యులర్ 20 ప్లస్ సీట్లలో ఆధిక్యంలో ఉంది.