బీజేపీ ఎమ్మెల్యేపై రైతుల దాడి.. బట్టలు ఊడిపోయాయి..
BJP's Abohar MLA Arun Narang, some other party leaders thrashed in Malout town. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన
By Medi Samrat Published on 27 March 2021 9:05 PM ISTనరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన పోరాటం కొనసాగుతుంది. అయితే.. ఆ నిరసన కార్యక్రమం కాస్త నేడు ఉద్రిక్తంగా మారింది. ఏకంగా ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారు రైతులు. వివరాళ్లోకివెళ్తే.. పంజాబ్‌లోని ముక్త్సర్ జిల్లాలోని మాలోట్‌లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌పై దాడికి పాల్పడ్డారు రైతులు.
అబోహర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అరుణ్ నారంగ్.. స్థానిక బీజేపీ కార్యాలయంలో వ్యవసాయ చట్టాలకు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టారు. విషయం తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో బీజేపీ ఆఫీసుకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఇది గమనించిన పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌ను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.
అయితే.. రైతులు ఎమ్మెల్యేను వెంబడించారు. దీంతో సదరు ఎమ్మెల్యేని పోలీసులు ఓ షాపులోకి తీసుకెళ్లారు. అది గమనించిన రైతులు షాపు ఎదుట ఆందోళనకు దిగి.. ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశారు. అక్కడా పరిస్థితి చేజారుతుండడంతో.. ఎమ్మెల్యే నారంగ్‌ను షాపు నుంచి సురక్షితంగా బయటకు తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారి వెంటపడి పరుగులు పెట్టించారు రైతులు.. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి.
ఈ క్రమంలోనే పోలీసులు, రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలోనే ఎమ్మెల్యేపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నారంగ్ బట్టలు చిరిగిపోవడంతో పాటు.. తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. చివరకు పోలీసులు అతికష్టంమీద .. ఎమ్మెల్యే నారంగ్‌ను అక్కడి నుంచి తరలించారు. అంతటితో శాంతించని రైతులు బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ నేతలకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.