గడ్కరీ పేరును ప్రకటించకపోవడంపై ఉద్ధవ్ గుస్సా
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది.
By Medi Samrat Published on 4 March 2024 9:45 PM ISTపార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరు లేకపోవడంపై శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తొలి జాబితాలో గడ్కరీ పేరు లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని.. తన తండ్రి బాల్ ఠాక్రే తలపెట్టిన ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం పూర్తి చేయడంలో గతంలో గడ్కరీతో తాను కలిసి పనిచేశానన్నారు. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించని నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలను అణిచివేసే రాజకీయాలు ప్రధాని మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సరికాదన్నారు ఉద్ధవ్. నకిలీ హామీలకు గ్యారంటీ అనే పేరు పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత కృపాశంకర్ సింగ్‌ను అందలమెక్కించారని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఆర్థిక అవకతవకల ఆరోపణలను ఎదుర్కొన్న కృపాశంకర్ సింగ్‌ను చేర్చుకోవడం న్యాయమేనా అని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన నేతలకు సంబంధించి తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారని, ఆ సాక్ష్యాలను మింగేశారా అని ప్రశ్నించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా కృపాశంకర్ సింగ్ బరిలోకి దిగారు.