రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి
BJP workers hurl shoes, blacken Rahul Gandhi's posters. వినాయక్ దామోదర్ సావర్కర్ బ్రిటీష్ వారికి సహాయం చేశారని, దానికి స్టైఫండ్ పొందారని
By Medi Samrat Published on 9 Oct 2022 5:13 PM ISTవినాయక్ దామోదర్ సావర్కర్ బ్రిటీష్ వారికి సహాయం చేశారని, దానికి స్టైఫండ్ పొందారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలు రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ముంబైలో నిరసన చేపట్టారు. స్వాతంత్య్ర సమరయోధుడిని రాహుల్ గాంధీ అవమానించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకుడు రామ్ కదమ్ ఆదివారం ఉదయం ముంబైలో తన పార్టీ కార్యకర్తలతో కలిసి 'జూటా మారో ఆందోళన్' ను నిర్వహించారు. రాహుల్ గాంధీ ముఖాన్ని, కటౌట్ లను చెప్పులతో కొట్టారు. రాహుల్ గాంధీ చేసిన అవమానకర వ్యాఖ్యలు శోచనీయమని, ఆయన క్షమాపణలు చెప్పాలని అన్నారు. పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రామ్ కదమ్ అన్నారు.
ఈ అంశంపై ఉద్ధవ్ ఠాక్రే వైఖరిని ప్రశ్నిస్తూ, "ఈ అంశంపై ఉద్ధవ్ ఠాక్రే స్టాండ్ ఏమిటి? ఆయన ఎందుకు ఏమీ మాట్లాడటం లేదు, రాహుల్ గాంధీని ఎందుకు విమర్శించడం లేదు? ఆయన హిందుత్వాన్ని వదిలిపెట్టారా, బాలాసాహెబ్ థాకరే సిద్ధాంతాలను అసలు పాటించడం లేదా" అని కదమ్ ప్రశ్నించారు.
శనివారం కర్ణాటకలో విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, "చివరిసారిగా నాకు గుర్తుంది బ్రిటీష్‌తో పోరాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారు సంవత్సరాలు జైలులో ఉన్నారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, వీరంతా తమ బ్రిటీష్‌తో పోరాడుతూ జీవితాలను త్యాగం చేశారు." అని అన్నారు. "నాకు తెలిసిన చరిత్రలో, ఆర్‌ఎస్‌ఎస్ బ్రిటీష్ వారికి సహాయం చేసింది. సావర్కర్ బ్రిటీష్ వారి నుండి స్టైఫండ్ పొందేవాడు, ఇవి బీజేపీ కూడా దాచలేని చారిత్రక వాస్తవాలు" అని రాహుల్ అన్నారు.