'నా మాటలను బీజేపీ వక్రీకరించింది'.. సనాతన ధర్మం వివాదంపై ఉదయనిధి స్టాలిన్
'సనాతన ధర్మం'పై తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ, బీజేపీ వక్రీకరించి, విస్తృతం చేస్తున్నాయని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు.
By అంజి Published on 4 Dec 2023 8:00 AM GMT'నా మాటలను బీజేపీ వక్రీకరించింది'.. సనాతన ధర్మం వివాదంపై ఉదయనిధి స్టాలిన్
'సనాతన ధర్మం'పై తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన పార్టీ బీజేపీ వక్రీకరించి, విస్తృతం చేస్తున్నాయని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. ఆదివారం కరూర్ జిల్లాలో జరిగిన యువజన కేడర్ సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని " దోమలు, డెంగ్యూ, మలేరియా, జ్వరాలు, కరోనా "తో పోల్చి, గతంలో చేసిన ప్రకటనతో తలెత్తిన గందరగోళంపై స్పందించారు.
మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని తప్పుదారి పట్టించారని ఆరోపించిన ఉదయనిధి స్టాలిన్.. ''నేను మారణహోమానికి పిలుపునిచ్చానని ఆయన (ప్రధాని మోదీ) అన్నారు, కానీ నేను చెప్పని విషయాలను ఆయన అన్నారు. నేను ఒక సమావేశంలో పాల్గొని మూడు నిమిషాలు మాట్లాడాను. ఎలాంటి వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూడాలని నేను చెప్పాను. వివక్షను రూపుమాపాలి అన్నారు. కానీ దాన్ని వక్రీకరించి, పెద్దది చేసి, యావత్ భారతదేశం నా గురించి మాట్లాడుకునేలా చేశారు'' అని అన్నారు.
అతను ఎదుర్కొన్న భారీ ఎదురుదెబ్బను ప్రస్తావిస్తూ డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ఇలా అన్నాడు.. ''ఎవరో గాడ్ మన్ 5-10 కోట్ల రూపాయల బహుమతిని ప్రకటించారు. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోందని, కోర్టుపై నమ్మకం ఉందన్నారు. నా వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని నన్ను అడిగారు, అయితే నేను క్షమాపణ చెప్పలేనని చెప్పాను. నేను స్టాలిన్ కొడుకునని, కలైంజ్ఞర్ మనవడినని, నేను వారి భావజాలాన్ని మాత్రమే సమర్థిస్తున్నాను'' అని చెప్పానన్నారు.
సెప్టెంబరులో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఇది "సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధం"గా ఉందన్నారు. అతని వ్యాఖ్యలు అధికార బీజేపీ నుండి తీవ్ర విమర్శలకు దారితీశాయి. స్టాలిన్ ప్రకటన యూదుల గురించి హిట్లర్ యొక్క అభిప్రాయాలను "వింతగా పోలి ఉంది" అని ఆ పార్టీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా అన్నారు. మద్రాస్ హైకోర్టు కూడా ఉదయనిధి స్టాలిన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ విషయంలో పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించింది. విభజన ఆలోచనలను ప్రోత్సహించడానికి లేదా ఏదైనా భావజాలాన్ని రద్దు చేయడానికి ఏ వ్యక్తికి హక్కు లేదని హైకోర్టు పేర్కొంది.
ఏది ఏమైనప్పటికీ, ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై తన వైఖరిని రెట్టింపు చేసాడు. తాను "ఎప్పటికీ దానిని వ్యతిరేకిస్తాను", తన ప్రకటన కోసం చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.