ఓ టీవీ చర్చ సందర్భంగా మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ఆదివారం పార్టి అధిస్టానం సస్పెండ్ చేసింది. ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్ నవీన్ కుమార్ జిందాల్‌ను కూడా పార్టీ సస్పెండ్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శుక్రవారం హింస చెలరేగింది. నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై కొందరు వ్యక్తులు దుకాణదారులను బలవంతంగా షట్టర్‌లు దించాలని బెదిరించడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో 20 మంది పోలీసులతో సహా 40 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గందరగోళాన్ని అణిచివేసే ప్రయత్నాలలో భాగంగా ఆదివారం.. బీజేపీ అధిస్టానం తాము అన్ని మతాలను గౌరవిస్తామని.. ఏ మతానికి చెందిన గొప్ప వ్యక్తులను వ్యక్తులను ఎవరూ అవమానించడాన్ని అంగీకరించబోమని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ ఇరువురిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
మే 26న టైమ్స్ నౌలో జ్ఞాన్‌వాపి మసీదు-కాశీ విశ్వనాథ్ ఆలయ వివాదంపై జరిగిన కార్యక్రమంలో బిజెపి నాయకురాలు ఈ వ్యాఖ్యలు చేశారు. తర్వాత రోజు సోషల్ మీడియాలో పెద్దఎత్తున గందరగోళం నెలకొంది.