చెన్నై: తమిళ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఎట్టకేలకు స్పందించారు. తన వ్యాఖ్యల వల్ల త్రిషకు లేదా మరెవరికైనా మనస్తాపం కలిగి ఉంటే హృదయపూర్వక విచారం వ్యక్తం చేస్తున్నానని సోమవారం ప్రకటించారు. త్రిష తనను తీవ్రంగా విమర్శించిన కొద్దిసేపటికే ఆయన ఈ క్షమాపణలు చెప్పడం గమనార్హం.
ఏం జరిగిందంటే?
ఇటీవల ఒక రాజకీయ సభలో నటుడు, టీవీకే (TVK) అధినేత విజయ్‌పై విమర్శలు చేసే క్రమంలో.. నైనార్ నాగేంద్రన్ అనవసరంగా త్రిష పేరును ప్రస్తావించారు. "విజయ్ ముందుగా త్రిష ఇంటి నుండి బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్లాలి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. దీనిపై త్రిష ఘాటుగా స్పందిస్తూ.. తన పేరును రాజకీయాల్లోకి లాగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరి నుండి అగౌరవం వచ్చినా సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
త్రిష రియాక్షన్ తర్వాత బీజేపీ అధిష్టానం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో నైనార్ నాగేంద్రన్ తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. "ఆ వ్యాఖ్య పొరపాటున జరిగింది. మా అఖిల భారత మహిళా విభాగం అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ మరియు అన్నామలై గారు కూడా నాతో మాట్లాడారు. ఆ ప్రకటన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, నేను నా హృదయపూర్వక విచారం వ్యక్తం చేస్తున్నాను." అని నాగేంద్రన్ పేర్కొన్నారు.