బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా శనివారం పాట్నాలో రోడ్‌షో నిర్వహిస్తున్నారు. నడ్డా శనివారం పాట్నా విమానాశ్రయానికి చేరుకున్నారు. రెండు రోజుల పాటు జరిగే జాతీయ సంయుక్త కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. బీహార్‌లో బీజేపీ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉంది. ఇక రాష్ట్రంలో జనతాదళ్-యునైటెడ్‌తో పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. వచ్చే ఎన్నికలకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. భాజపా 'ప్రవాస్ ప్రోగ్రామ్'ను నిర్వహిస్తోంది, ఇందులో భాగంగా పార్టీ నాయకులు జులై 28 మరియు 29 తేదీల్లో బీహార్‌లోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల నుండి అభిప్రాయాన్ని తీసుకున్నారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్, బీహార్ కో-ఇన్‌చార్జ్ హరీష్ ద్వివేది సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జూలై 30న ప్రారంభ రోజున నడ్డా వస్తున్నారని.. హోం మంత్రి అమిత్ షా ఒక రోజు తర్వాత కార్యక్రమానికి వస్తున్నారని తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులు జూలై 31న సమావేశానికి హాజరవుతారు. జూలై 31న పాట్నా బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి 16 జిల్లాల్లో బీజేపీ జిల్లా కార్యాలయాలను నడ్డా ప్రారంభించి, 7 జిల్లాల్లో భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి జ్ఞాన్ భవన్‌లో ముగింపు సభ నిర్వహించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు పాట్నా చేరుకోనున్నారు హోంమంత్రి అమిత్ షా.