విమానం టేకాఫ్ వివాదం.. బీజేపీ ఎంపీలపై కేసు

BJP MPs Nishikant Dubey, Manoj Tiwari booked for forcing flight take-off at Deoghar airport. బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మ‌నోజ్ తివారీ ల‌పై కేసు నమోదైంది.

By Medi Samrat
Published on : 3 Sept 2022 3:45 PM IST

విమానం టేకాఫ్ వివాదం.. బీజేపీ ఎంపీలపై కేసు

బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మ‌నోజ్ తివారీ ల‌పై కేసు నమోదైంది. జార్ఖండ్‌లోని దియోఘ‌ఢ్ ఎయిర్‌పోర్ట్‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా త‌మ చార్ట‌ర్డ్ విమానం టేకాఫ్‌కు అనుమ‌తించాల‌ని అధికారుల‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చార‌న ఎంపీలు నిషికాంత్ దూబే, మ‌నోజ్ తివారీ స‌హా ఏడుగురు ఇత‌రుల‌పై కేసు న‌మోదు చేశారు. ఎయిర్ పోర్ట్ డీఎస్‌పీ సుమ‌న్ అన‌న్ ఫిర్యాదు ఆధారంగా బీజేపీ నేత‌ల‌పై కేసు న‌మోదైంది. ఇత‌రుల ప్రాణాల‌ను ప్ర‌మాదంలోకి నెట్ట‌డంతో పాటు నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించినందుకు నిషికాంత్ దూబే, మ‌నోజ్ తివారీ, ఎయిర్‌పోర్ట్ డైరెక్ట‌ర్ స‌హా ప‌లువురిపై ఎఫ్ఐఆర్ న‌మోదైంది.

ఎఫ్ఐఆర్‌లో న‌మోదైన వివ‌రాల ప్ర‌కారం.. ఆగ‌స్ట్ 31న ఎంపీ నిషికాంత్ దూబే, ఆయ‌న కుమారుడు క‌నిష్క్ కాంత్ దూబే, మ‌హికాంత్ దూబే, ఎంపీ మ‌నోజ్ తివారీ, ముఖేష్ పాఠ‌క్‌, దేవ్తా పాండే, పింటు తివారి అనుమ‌తి లేకుండా దియోఘ‌ఢ్ ఎయిర్‌పోర్ట్‌లోని హైసెక్యూరిటీ ప్రాంత‌మైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)లోకి ప్ర‌వేశించారు. త‌మ ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి త‌మ చార్ట‌ర్డ్ విమానానికి క్లియ‌రెన్స్ ల‌భించేలా అధికారుల‌పై ఒత్తిడి తెచ్చారు. కొత్త విమానాశ్ర‌యంలో ఇంకా రాత్రివేళ‌ల్లో విమానాల రాక‌పోక‌ల‌కు అనుమ‌తి ల‌భించ‌లేదు. ప్ర‌స్తుతం ఈ ఎయిర్‌పోర్ట్‌లో సూర్యాస్త‌మ‌యానికి 30 నిమిషాల ముందు వ‌ర‌కే విమాన స‌ర్వీసుల‌ను అనుమ‌తిస్తున్నారు. బీజేపీ నేత‌లు ప్ర‌యాణిస్తున్న చార్ట‌ర్డ్ విమానం రాత్రి 6.17 గంట‌ల‌కు టేకాఫ్ అవ్వడం వివాదాస్పదమైంది.


Next Story